రగులుతున్న పంజాబ్‌

రగులుతున్న పంజాబ్‌

పంజాబ్‌ ముఖ్యమంత్రి బియాంత్‌సింగ్‌ హంతకుడు రాజోనా ఉరిశిక్ష వ్యవహారం ఆ రాష్ట్రాన్ని ఉద్రిక్తతవైపు నెడుతోంది. ఈ నెల 31న ఉరి తీయాల్సి వుండగా... పలువురు శిక్ష అమలును వాయిదా వేయాలని కోరుతున్నారు. అయితే... వాయిదాకు న్యాయస్థానం అంగీకరించకపోవడంతో సిక్కు మతానికి చెందిన పలు సంస్థలు ఇవాళ పంజాబ్‌ బంద్‌కు పిలుపునిచ్చాయి. 

రాష్ట్రంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో భారీ సంఖ్యలో బలగాలను మోహరించారు. పంజాబ్‌ ముఖ్యమంత్రి బియాంత్‌ సింగ్‌ను దారుణంగా హతమార్చిన కేసులో బల్వంత్‌ సింగ్‌ రాజోనాకు ఉరిశిక్ష పడింది. రాజోనాను ఈ నెల 31న ఉరి తీయాల్సి వుంది. ఖలిస్తాన్‌ ఉద్యమాన్ని అణగదొక్కాడన్న ఆగ్రహంతో రాజోనా, దిలావర్‌ సింగ్‌లిద్దరు మానవ బాంబులుగా మారి, బియాంత్‌ సింగ్‌ హత్యకు పథకం వేశారు. 

వీరిలో దిలావర్‌ సింగ్‌ మరణించగా... రాజోనా పోలీసులకు చిక్కాడు. రాజోనాకు ఉరిశిక్ష ఖాయమవడంతో ఆయన్ను పటియాలా జైలులో నిర్బంధించారు. ఈ నేపథ్యంలో మార్చి ముప్పై ఒకటిన శిక్ష అమలుకు రంగం సిద్దమైంది. అయితే.. జైలులో ఉరి శిక్ష అమలు చేసే తలారీ లేకపోవడంతో దాన్ని నిర్వహించాల్సిన బాధ్యత జైలు సూపరింటెండెంట్‌ లఖ్వీందర్‌ సింగ్‌ జక్కర్‌పై పడింది. 

రాజోనాను ఉరి తీయలేనంటూ జక్కర్‌ కోర్టునాశ్రయించారు. శిక్ష అమలును వాయిదా వేయాలని కోరారు. ఉరి శిక్షను వాయిదా వేయాలని కోరుతున్న వారికి రాజకీయ పార్టీల మద్దతు లభిస్తోంది. సీఎం ప్రకాశ్‌ సింగ్‌ బాదల్‌ ఈ విషయంలో రాష్ట్రపతిని కల్వాలని నిర్ణయించారు. రాజోనాకు క్షమాభిక్ష ప్రసాదించాలని ఆయన రాష్ట్రపతిని కోరనున్నారు. 

ఇదిలా వుంటే... రాజోనా ఉరిని రద్దు చేయాలన్న ఆందోళన పంజాబ్‌లో ఊపందుకుంది. ఫలితంగా రాష్ట్రం మొత్తం ఉద్రిక్తత ఏర్పడింది. ఈనేపథ్యంలో 60 వేల మంది పోలీసులు, 15 కంపెనీల పారామిలటరీ దళాల పహారా మధ్య రాష్ట్ర బంద్‌ కొనసాగుతోంది.