ఉన్మాది అరెస్టు

వరంగల్ జిల్లా మహబూబాబాద్‌లో శనివారం సాయంత్రం దారుణం చోటు చేసుకుంది. ఓ ఉన్మాది తనయుడు తల్లిని కత్తితో నరికాడు. ఖమ్మం జిల్లా బయ్యారం గ్రామానికి చెందిన ఉపేంద్ర అనే మహిళ తన కుమారుడు బాలకృష్ణను మహబూబాబాద్ ఆస్పత్రికి తీసుకుని వచ్చింది. మానసిక నిపుణులతో చికిత్స చేయిస్తున్న క్రమంలో వారం వారం వచ్చినట్లే శనివారం కూడా వచ్చింది. ఈ సమయంలో తాను కొబ్బరిబొండాం తాగుతానని తల్లి ఉపేంద్రతో కుమారుడు బాలకృష్ణ చెప్పాడు. అందుకు తల్లి అంగీకరించి కొబ్బరి బొండాం దుకాణం వద్దకు కుమారుడితో కలిసి వచ్చింది.

కొబ్బరి బొండాలు ఉన్న చోట తల్లికి, కొడుకుకి మధ్య వాగ్వివాదం జరిగింది. ఈ సమయంలో బాలకృష్ణ కొబ్బరి బొండాలు నరికే కత్తితో తల్లిపై దాడి చేశాడు. దీంతో ఆ మహిళ తలకు, చేయికి గాయాలయ్యాయి. ఆమెను ఆస్పత్రిలో చేర్చారు. బాలకృష్ణను స్థానికులు పట్టుకుని చితకబాది, చెట్టుకి కట్టేశారు. ఆ తర్వాత పోలీసులకు సమాచారం అందించారు. దాంతో పోలీసులు అతడ్ని అదుపులోకి తీసుకున్నారు. సైకో కావడం వల్లనే బాలకృష్ణ తల్లిపై దాడి చేశాడని అంటున్నారు.