భార్యను తెగ నరికి హత్య చేసిన భర్త

 కడప జిల్లాలో ఓ కిరాతక భర్త తన భార్యను దారుణంగా హత్య చేశాడు. భార్యపై అనుమానంతో భార్యను అ దుర్మార్గుడు కత్తితో నరికి హత్య చేశాడు. దాంతో ఆగకుండా ఆమె శరీరంపై ఎక్కడ పడితే అక్కడ కత్తితో ఛిద్రం చేశాడు. తాగిన మత్తులో అతను ఈ దారుణానికి ఒడి గట్టాడు. ఆదివారం అర్థరాత్రి ఈ సంఘటన జరిగినట్లు పోలీసులు గుర్తించారు. కడప జిల్లా మూలవంక గ్రామంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. మూలవంకలోని వెంకట సుబ్బారెడ్డి, పద్మావతి గ్రామంలో కూల్ డ్రింక్ దుకాణం నడిపేవారు. వారికి ముగ్గురు సంతానం. కుమారుడు, కోడలు చెన్నైలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లుగా పనిచేస్తున్నారు. సుబ్బారెడ్డి, పద్మావతి చెన్నై వెళ్లి నెల రోజుల పాటు అక్కడే ఉండి పది రోజుల క్రితం వచ్చారు. 

కుమారుడు, కోడలు సంపాదిస్తుండడంతో సుబ్బారెడ్డి కూల్ డ్రింక్ షాపు మూసేశాడు. సుబ్బారెడ్డి నుంచి పోలీసులు రాబట్టిన విషయాల ప్రకారం - సుబ్బారెడ్డి ఎప్పటిలాగే ఆదివారంనాడు గొంతు దాకా మద్యం సేవించి ఇంటికి వచ్చాడు. భార్య వడ్డించిన ఆహారం బోంచేశాడు. ఆ తర్వాత దంపతుల మధ్య వివాదం చోటు చేసుకుంది. భార్యపై అనుమానం ఉన్న సుబ్బారెడ్డి ఆమెపై కత్తితో దాడి చేసి హత్య చేశాడు. ఆ తర్వాత అక్కడే నిద్రపోయాడు

ఆదివారం నుంచి ఇంటి తలుపులు తెరవకపోవడంతో స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు వచ్చి ఇంటి తలుపు తెరిచారు. చూసే సరికి పద్మావతి శవమై పడి ఉంది. వెంకట సుబ్బారెడ్డి కనిపించలేదు. దాంతో వారు గాలించి వెంకటసుబ్బారెడ్డిని వెతికి పట్టుకున్నారు. ఆదివారం రాత్రి భార్యను హత్య చేసిన తర్వాత నిద్రపోయిన సుబ్బారెడ్డి సోమవారం కూడా అదే మత్తులో పడుకున్నాడు. మంగళవారం మెలుకువ వచ్చింది. వెంటనే ఇంటికి తాళం వేసి ఉడాయించాడు. ప్రస్తుతం సుబ్బారెడ్డి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.