శశికళను క్షమించిన జయలలిత

శశికళను క్షమించిన జయలలిత

తన ప్రియసఖి శశికళను తమిళనాడు ముఖ్యమంత్రి, అన్నాడియంకె అధినేత జయలలిత క్షమించారు. శశికళపై వేసిన బహిష్కరణ వేటును ఆమె శనివారం ఎత్తేశారు. ఇంతకాలం శశికళపై బహిష్కరణ అమలులో ఉంది. తన బంధువులందరితో తాను తెగదెంపులు చేసుకుంటున్నట్లు శశికళ ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. నాలుగు నెలల క్రితం బహిష్కరణ వేటు వేసి శశికళను పోయెస్ గార్డెన్ నుంచి జయలలిత పంపించి వేశారు. జయలలితకు వ్యతిరేకంగా పనిచేసిన తన బంధువులు, సన్నిహితుల కుట్ర సహించరానిదని, తన సోదరిని మోసం చేసినవారెవరూ తనకు అవసరం లేదని శశికళ చెప్పారు. 

శశికళ భర్త నటరాజన్‌పై, ఆమె బంధువులపై పెద్ద యెత్తున పోలీసులు కేసులు పెట్టారు. శశికళపై ఉన్న కేసులను కూడా ఎత్తివేసేందుకు జయలలిత చర్యలు తీసుకునే అవకాశం ఉంది. తన జీవితం జయలలితకే అంకితమని, తమ నేతకు సేవలందించాలని తాను అనుకుంటున్నానని శశికళ అన్నారు. జయలలితతో పాటు బెంగుళూర్ కోర్టులో శశికళ ఆదాయానికి మించిన ఆస్తుల కేసును ఎదుర్కుంటున్నారు. కోర్టులో వాంగ్మూలం ఇస్తూ శశికళ ఆ మధ్య కాలంలో ఏడ్చేశారు. ఈ కేసులో జయలలితకు సంబంధం లేదని, అంతా తనదేనని ఆమె కోర్టులో చెప్పారు. ఆ రకంగా జయలలితను తప్పించడానికి ఆమె మాట్లాడారు.