జగన్ కేసులో సిబిఐ చార్జిషీట్ దాఖలు

జగన్  కేసులో సిబిఐ చార్జిషీట్ దాఖలు

కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ ఆస్తుల కేసులో సిబిఐ శనివారం సాయంత్రం కోర్టులో చార్జిషీట్ దాఖలు చేసింది. జగతి పబ్లికేషన్ వైస్ చైర్మన్ విజయసాయి రెడ్డిపై అభియోగాలు మోపుతూ ఈ చార్జిషీట్ దాఖలైంది. ఆయనపై ఏడు సెక్షన్ల కింద సిబిఐ అభియోగాలు మోపింది. నిరుడు ఆగస్టులో వైయస్ జగన్‌పై అక్రమాస్తుల కేసును సిబిఐ నమోదు చేసింది. ఆ తర్వాత ఈ ఏడాది జనవరిలో విజయసాయి రెడ్డిని అరెస్టు చేసింది. జగన్ ఆస్తుల కేసులో అరెస్టయిన వ్యక్తి విజయసాయి రెడ్డి ఒక్కరే. రెండు పెట్టెల్లో సిబిఐ అధికారులు చార్జిషీట్‌ను హైదరాబాదులోని నాంపల్లి ప్రత్యేక కోర్టుకు తరలించారు. వైయస్ జగన్ ఆస్తుల కేసులో సిబిఐ 72 మందిని ఎఫ్ఐఆర్‌లో చేర్చింది. చార్జిషీట్‌లో ఉన్న వ్యక్తుల పేర్లపై ఉత్కంఠ చోటు చేసుకుంది. 

వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వ హయాంలో జారీ అయిన 26 వివాదాస్పదమైన జీవోలను సిబిఐ పరిశీలించింది. వైయస్ జగన్ సంస్థల్లో పెట్టుబడులు పెట్టిన పలువురు వ్యాపారవేత్త వాంగ్మూలాలను నమోదు చేసింది. వైయస్ హయాంలో కీలక బాధ్యతలు నిర్వహించిన పలువురు ఐఎఎస్ అధికారులను విచారించింది. సండూర్ పవర్ నుంచి జగన్ సంస్థల్లోకి నిధులు మళ్లిన వైనాన్ని పరిశీలించింది. వివిధ అల్లిబిల్లి కంపెనీల వ్యవహారాలను, విదేశీ పెట్టుబడుల వ్యవహారాన్ని సిబిఐ పరిశీలించింది. 

వైయస్ జగన్ ఆస్తుల కేసులో చార్జిషీట్ దాఖలు చేయనున్న నేపథ్యంలో కొన్ని మీడియా సంస్థల కార్యాలయాల వద్ద భద్రతను పెంచారు. ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా పోలీసులను అప్రమత్తం చేశారు. గట్టి భద్రతా ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం జగన్ గోదావరి జిల్లాలో ఓదార్పు యాత్ర చేస్తున్నారు. గుంటూరు జిల్లాలో భద్రతను కట్టుదిట్టం చేశారు. గత యాభై రోజులుగా వైయస్ జగన్ గుంటూరు జిల్లాలో పర్యటిస్తున్నారు. శనివారం సాయంత్రం ఆయన గుంటూరు జిల్లా యాత్ర ముగుస్తుంది.