తెర పైకి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ?

హైదరాబాద్: తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ పార్టీ నేతలు సొంత పార్టీ పెట్టవచ్చుననే వార్తలు వినిపిస్తున్నాయి. తెలంగాణపై అధిష్ఠానం ఏమీ తేల్చకుండా నాన్చుడు ధోరణి ప్రదర్శిస్తుండటంతో ఆ ప్రాంత కాంగ్రెస్ నేతలు ప్రత్యామ్నాయ మార్గాల కోసం అన్వేషణ ప్రారంభించారని అంటున్నారు. ఉప ఎన్నికల్లో తెలంగాణ సెంటిమెంట్ ప్రభావం తీవ్రంగా ఉండడం, కాంగ్రెస్ అభ్యర్థులకు వరుసగా ఘోర పరాజయాలు ఎదురవుతుండటంతో ఆ పార్టీ నేతలకు ఎటూ పాలుపోవడం లేదు. ఆత్మహత్యల నేపథ్యంలో తమ చిత్రాలను, దిష్టి బొమ్మలను దహనం చేస్తున్నా రాజీవ్, ఇందిర విగ్రహాలను ధ్వంసం చేస్తున్నా ఖండించలేని పరిస్థితి ప్రస్తుతం నెలకొంది. సొంత నియోజకవర్గాల్లో స్వేచ్ఛగా తిరగలేక పోతున్నారు. అదే సమయంలో యుపిఏ ప్రభుత్వం తెలంగాణ ఇచ్చే పరిస్థితి లేదనే అభిప్రాయం వారిలో కనిపిస్తోందని అంటున్నారు. కేంద్ర ప్రభుత్వంలో కీలక భాగస్వాములైన ఎన్సీపి, తృణమూల్ నేతలు శరద్ పవార్, మమతా బెనర్జీ విభజనకు వ్యతిరేకమనే వాదనలున్నాయి. చిన్న రాష్ట్రాలకు తాము వ్యతిరేకమని సమాజ్‌వాది నేత ములాయం బహిరంగంగానే చెప్పారు. తెలంగాణకు సానుకూలతను వ్యక్తం చేస్తే తమ సొంత రాష్ట్రాల్లో సమస్యలు ఎదురవుతాయనే ఆందోళనే దీనికి కారణం.

ఈ మూడు పార్టీల మాట కాదని కాంగ్రెస్ అడుగు ముందుకేసే పరిస్థితి లేదని తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ నేతలు అభిప్రాయపడుతున్నారట. తాము ఏం చెప్పినా ఇక తెలంగాణ ప్రజలు నమ్మే పరిస్థితి లేదనే అభిప్రాయమూ వారిలో ఉందని అంటున్నారు. తమను తెలంగాణ ద్రోహులుగా చిత్రీకరించడం, భావోద్వేగాలు తీవ్రమైన ప్రతిసారీ తమ ఇళ్లపై రాళ్ల దాడులు చేయడం, నాయకులను అడ్డుకోవడంవంటి చర్యలు తెలంగాణ కాంగ్రెస్ నేతలను ఇరకాటంలో పడేస్తున్నాయి. పరిస్థితి ఇలాగే కొనసాగితే రాజకీయంగా తమకు మనుగడ ఉండదని వీరు ఆందోళన చెందుతున్నారు. దీనికి ప్రత్యేక పార్టీ స్థాపించడమొక్కటే తమ సమస్యలకు పరిష్కారమని వీరు భావిస్తున్నారని అంటున్నారు. అయితే ఇందుకు ముందు మరోసారి అధిష్టానంతో సమావేశమై తెలంగాణపై ఒప్పించే ప్రయత్నాలు చేయాలని చూస్తున్నారట.

శాసన సభ బడ్జెట్ సమావేశాలు ముగిసిన వెంటనే ఢిల్లీకి వెళ్లాలని టి-కాంగ్రెస్ నేతలు నిర్ణయించుకున్నారు. ఈసారి ఢిల్లీలో నాలుగైదు రోజులు మకాం వేసి, అధిష్ఠానం పెద్దలతో సంప్రదింపులు జరుపుతామని, ప్రజాకాంక్షను నెరవేర్చేందుకు కృషి చేస్తామని సీనియర్ మంత్రి జానా రెడ్డి చెప్పారు. మరో మంత్రి బస్వరాజు సారయ్య కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. పార్టీ నేతలు గతంలో అధిష్ఠానం పిలిచి మాట్లాడిన వెంటనే తమ ఆందోళనలను వాయిదా వేసుకుంటూ వచ్చారు. ఈసారి మాత్రం అలా కాకుండా గట్టిగా వ్యవహరించాలని నిర్ణయించుకున్నారు. తాము అధిష్ఠానానికి విధేయులుగా ఉన్నప్పటికీ అవిశ్వాస పరీక్ష సమయంలో తెలంగాణతో ముడి పెట్టకుండా సర్కారుకు అండగా నిలిచినప్పటికీ తమపై అనుమానపు చూపులు చూస్తున్నారని ఈ ప్రాంత నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రతిసారీ అధిష్ఠానం తమను వారిస్తూ రావడమే తప్ప తమను అర్థం చేసుకున్నదే లేదని వాపోతున్నారు. తెలంగాణ వాదాన్ని గట్టిగా విన్పించిన రాజ్యసభ సభ్యుడు కె.కేశవ రావుకు మరోసారి అవకాశం కల్పించక పోవడాన్ని కూడా గుర్తు చేస్తున్నారట.

తెలంగాణ వాదాన్ని అధిష్ఠానం దృష్టికి తీసుకువెళ్లినప్పుడల్లా పార్లమెంటు సమావేశాలనో, ఏదో రాష్ట్రంలో ఎన్నికలనో మమ్మల్ని బుజ్జగించి వెనక్కి పంపిస్తున్నారని, ఖచ్చితమైన అభిప్రాయం చెప్పడం లేదని, అధిష్ఠానం మాటతో ప్రజల్లోకివెళ్లి చులకన అవుతున్నామని వారు ఆవేదన చెందుతున్నారట. అసెంబ్లీ సమావేశాలు ముగిసేలోగా తామంతా ఒకసారి సమావేశం కావాలని ఆ తర్వాత విడతల వారీగా ఢిల్లీకి వెళ్లి అధిష్ఠానంపై ఒత్తిడి పెంచాలని నిర్ణయించారు. అధిష్ఠానం సానుకూలంగా స్పందించకుండా అవమానకర రీతిలో వ్యవహరిస్తే ఇక ఏమాత్రం ఉపేక్షించకుండా పార్టీకి గుడ్‌బై చెప్పి వేరు కుంపటి పెట్టుకోవాలనే దిశగా నేతలు ఆలోచిస్తున్నారట.