జగన్ వ్యాఖ్యలపై రేణుకా సెటైర్లు

జగన్ వ్యాఖ్యలపై రేణుకా  సెటైర్లు

అవినీతి లేని పాలన అందిస్తానన్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలపై ఏఐసిసి అధికార ప్రతినిధి రేణుకా చౌదరి ఎద్దేవా చేశారు. ఆయన వ్యాఖ్యలపై ఆమె నవ్వుతూ... భలే భలే జోక్ జగనూ క్లీన్ గవర్నెన్సా అంటూ కామెంట్ చేశారు. ఏప్రిల్ ఒకటో తేది రాకుండానే జగన్ ప్రజల్ని ఫూల్స్‌ను చేస్తున్నారని, క్లీన్ గవర్నెన్స్‌కు స్పెల్లింగ్ కూడా జగన్‌కు తెలియదంటూ సెటైర్ వేశారు. పద్దెనిమిది స్థానాల్లో ఉప ఎన్నికల తర్వాత రాష్ట్రంలో ప్రభుత్వం పడిపోతుందంటూ జగన్, ఆయన వర్గం చేస్తున్న వ్యాఖ్యల పైనా ఆమె స్పందించారు. ముందు జగన్ ఎంత కాలం జైలు బయట ఉంటారో జోస్యం చెప్పాలని అన్నారు. జగన్ మాటలు చూసి రాష్ట్ర ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు.

35 పార్లమెంటు స్థానాలు గెలుస్తానన్న జగన్ వ్యాఖ్యలపై విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ హైదరాబాదులో స్పందించారు. అసలు దీనిపై మాట్లాడడానికి నాకే నవ్వోస్తుందన్నారు. ముప్పై అయిదు పార్లమెంటు సీట్లు వస్తాయని జగన్ అనటం పెద్ద జోక్ అన్నారు. 275 పార్లమెంట్ స్థానాలను కూడా వాళ్ల పార్టీయే గెలుస్తుందని చెప్పలేదని ఎద్దేవా చేశారు. తెలంగాణలో ఆ పార్టీ పోటీ చేయలేదు, ఆంధ్రా, రాయలసీమల్లో ఉన్నవి 25 ఎంపీ స్థానాలేనని గుర్తు చేశారు. 35 స్థానాలు ఎలా కైవసం చేసుకుంటారని అన్నారు. 50 వేల మెజారిటీ వస్తుందని వైయస్సార్ కాంగ్రెసు జబ్బలు చరుచుకుంటే కేవలం 23 వేల మెజారిటీయే వచ్చిందన్నారు.