ఫ్యామిలీతో శశికళ తెగదెంపులు

ఫ్యామిలీతో శశికళ తెగదెంపులు

తన ప్రియసఖి, తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు తిరిగి దగ్గర కావడానికి శశికళ ప్రయత్నిస్తున్నారు. అందుకుగాను, తన కుటుంబ సభ్యులతో సంబంధాలను తెగదెంపులు చేసుకుంటున్నట్లు శశికళ బుధవారం ప్రకటించారు. ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా తన బంధువులు కుట్ర చేసిన విషయం తనకు తెలియదని ఆమె అన్నారు. జయ టీవీ చానెల్ శశికళ ప్రకటనను ఫ్లాష్ చేసింది. 

జయలలితను మోసం చేసిన ప్రతి ఒక్కరితో తాను సంబంధాలను తెంపుకున్నానని, తన బంధువులు జయలలితకు వ్యతిరేకంగా కుట్ర చేసినట్లు తనకు తెలియదని, అలాంటి వారిని తాను క్షమించలేనని శశికళ అన్నారు. నిరుడు డిసెంబర్‌లో శశికళను, ఆమె బంధువులను జయలలిత అన్నాడియంకె పార్టీ నుంచి బహిష్కరించారు. శశికళ భర్త నటరాజన్‌పై ఆ తర్వాత పలు కేసులు నమోదయ్యాయి. 

జయలలితను మోసం చేయాలని తాను ఏ క్షణంలో కూడా ఆలోచించలేదని, జయలలితను మోసం చేసినవారెవరూ తనకు అవసరం లేదని, జయలలితకు వ్యతిరేకంగా కుట్రలు చేశారని విని తాను ఆశ్చర్యానికి గురయ్యానని ఆమె అన్నారు. శశికళ పశ్చాత్తాపానికి గురై ఈ ప్రకటన జారీ చేసినట్లు భావిస్తారు. పైగా, జయలలిత ఆశీస్సులున్న జయ టీవీ ప్లస్ చానెల్ ఈ ప్రకటనను ప్రసారం చేసింది.