తెలంగాణ బంద్ ప్రశాంతం

తెలంగాణ కోసం ఆత్మహత్యలు జరిగిన నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) ఇచ్చిన పిలుపు మేరకు మంగళవారం తెలంగాణ బంద్ ప్రశాంతంగా జరిగింది. విద్యా సంస్థలు, వ్యాపారసముదాయాలు మూతపడ్డాయి. పదో తర గతి పరీక్షలకు, ఆర్టీసీకి బంద్ నుంచి మినహాయింపు ఇచ్చారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం, మహాత్మాగాంధీ, పాలమూరు వర్సిటీలో మంగళవారం జరగాల్సి పరీక్షలు వాయిదా పడ్డాయి. 

తెరాస బంద్‌కు భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం తెలంగాణ ఫోరం, తెలంగాణ నగారా సమితి, సిపిఐ, కాంగ్రెసు తెలంగాణ ఎంపిల బృందం మద్దతు పలికాయి. కార్యకర్తలు తెలంగాణ జిల్లాల్లో రాస్తారోకోలు, ఆందోళనలు నిర్వహించారు. బైక్ ర్యాలీలు తీశారు. హైదరాబాదులోని ఉస్మానియా విశ్వవిద్యాలయంలో విద్యార్థులు బైక్ ర్యాలీ తీస్తుండగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. విద్యార్థులు మాణిక్యేశ్వర నగర్ నుంచి తార్నాక వైపు ర్యాలీ నిర్వహిస్తుండగా అనుమతి లేదంటూ పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో అక్కడ కాసేపు స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఓయు ఎన్‌సిసి గేటు వద్ద కూడా బైక్ ర్యాలీ తీస్తున్న ఎబివిపి విద్యార్థులను పోలీసులు అరెస్టు చేశారు. 

ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు స్వచ్చంధంగా బంద్ పాటించాయి వ్యాపార, వాణిజ్య, పెట్రోల్ బంక్, సినిమా హాళ్లు పది జిల్లాల్లో మూతపడ్డాయి. వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఆటో డ్రైవర్లు 24 గంటల బంద్ తలపెట్టారు. కాగా కరీంనగర్ జిల్లాలోని గోదావరిఖనిలో బంద్‌కు సహకరించని ఊర్వశి థియేటర్ అద్దాలను ఆందోళనకారులు ధ్వంసం చేశారు.వరంగల్ జిల్లాలో బంద్ సంపూర్ణంగా జరిగింది. మెదక్ జిల్లాలో బంద్ సందర్భంగా సంగారెడ్డి, సిద్ధిపేటలో టీఆర్ఎస్ బైక్ ర్యాలీ నిర్వహించారు. రంగారెడ్డి జిల్లాలో బంద్ సందర్భంగా వికారాబాద్, పరిగిలో తెలంగాణ వాదులు ర్యాలీ చేపట్టారు.