బొత్సకు ఎసరు, కిరణ్‌కు పొన్నాల సహాయం?

బొత్సకు ఎసరు, కిరణ్‌కు పొన్నాల సహాయం?

పిసిసి పదవి నుంచి బొత్స సత్యనారాయణను తప్పించేందుకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వేసిన ప్లాన్‌లో మంత్రి పొన్నాల లక్ష్మయ్య కూడా ఓ చేయి వేస్తున్నట్లు తెలుస్తోంది. ఓ వైపు మద్యం సిండికేట్లపై ఎసిబి చేస్తున్న దాడులను వాడుకుంటూ మరో వైపు రాజకీయంగా కూడా బొత్స సత్యనారాయణను కార్నర్ చేసేందుకు కిరణ్ కుమార్ రెడ్డి ప్రణాళిక సిద్ధం చేసి అమలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి తనను టార్గెట్ చేసిన విషయంపై అధిష్టానానికి ఫిర్యాదు చేయడానికి బొత్స సత్యనారాయణ ఢిల్లీ వెళ్లిన సమయంలోనే పొన్నాల లక్ష్మయ్య అక్కడ దర్శనమిచ్చారు. 

తెలంగాణ పార్లమెంటు సభ్యులతో కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ గులాం నబీ ఆజాద్ ఏర్పాటు చేసిన సమావేశంలో కూడా ఆయన పాల్గొన్నారు. ఆ తర్వాత శుక్రవారం రాత్రి 8 గంటలకు ఆజాద్‌తో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. పిసిసి అధ్యక్ష పదవిని తెలంగాణవారికి ఇవ్వాలంటూ ఇటీవల తెలంగాణకు చెందిన సీనియర్ శాసనసభ్యుడు ఆర్ దామోదర్ రెడ్డి అధిష్టానానికి విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే. పొన్నాల లక్ష్మయ్య ప్రయత్నాలకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఆశీస్సులు కూడా ఉన్నాయని బొత్స వర్గం అనుమానిస్తోంది. 

ముఖ్యమంత్రి పీఠంపై కన్నేసిన బొత్స సత్యనారాయణ సాధ్యమైనంత త్వరగా కిరణ్ కుమార్ రెడ్డికి చెక్ పెట్టాలనే ఉద్దేశంతో ఉన్నట్లు అనుమానిస్తున్నారు. ఇందులో భాగంగానే ఆయన అసమ్మతిని పెంచి పోషిస్తున్నారని చెబుతున్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై పొగలు కక్కుతున్న మంత్రి డిఎల్ రవీంద్రా రెడ్డి, మాజీ మంత్రి పి. శంకరరావు తదితరల వెనక బొత్స సత్యనారాయణ పాత్ర ఉందని అంటున్నారు. బొత్స సత్యనారాయణను పిసిసి పదవి నుంచి తప్పించగలిగితే తనకు తక్షణ ముప్పు తప్పుతుందని ముఖ్యమంత్రి భావిస్తున్నట్లు చెబుతున్నారు. 

ఇదిలావుంటే, రాష్ట్రంలోని 18 శాసనసభా స్థానాలకు, ఓ లోకసభ స్థానానికి జూన్‌లోనే ఉప ఎన్నికలు జరిగేలా చూడాలని బొత్స సత్యనారాయణ భావిస్తుంటే, మేలో జరిగేలా చూడాలని ముఖ్యమంత్రి అభిప్రాయపడుతున్నట్లు తెలుస్తోంది. ఎంత తొందరగా ఉప ఎన్నికలు వస్తే అంత తొందరగా ఫలితాలు వెలువడి ముఖ్యమంత్రి మరింత ఇరకాటంలో పడుతారని బొత్స భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఉప ఎన్నికల్లో ఓటమి ఎదురైతే, ముఖ్యమంత్రిపై వేటు పడడం ఖాయమని కూడా అంటున్నారు. అందుకే బొత్స సత్యనారాయణ ఉప ఎన్నికలు త్వరగా వస్తే మంచిదని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. ఏమైనా, రాష్ట్ర కాంగ్రెసు రాజకీయాలు రసకందాయంలో పడ్డాయి.