జగన్ మంచి వ్యక్తి. : పి.శంకర్రావు

జగన్ మంచి వ్యక్తి. : పి.శంకర్రావు

వచ్చే 2014లో రాష్ట్ర ముఖ్యమంత్రి పీఠాన్ని కడప ఎంపీ వైఎస్.జగన్మోహన్ రెడ్డి చేజిక్కించుకోవడం ఖాయమని సికింద్రాబాద్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి పి.శంకర్రావు జోస్యం చెప్పారు. ఆయన శనివారం హైదరాబాద్‌లో మాట్లాడుతూ.. జగన్ చాలా మంచి వ్యక్తి అని ఆయనకు మంచి రోజులు వచ్చాయని, అందువల్ల మంచి భవిష్యత్ ఉందని శంకర్రావు చెప్పుకొచ్చారు. 2014లో జగన్మోహన్‌ రెడ్డి సీఎం పగ్గాలు చేపట్టడం ఖాయమని ఆయన జోస్యం చెప్పారు. 

ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో ఇద్దరి హవా మాత్రమే సాగుతోందన్నారు. వారిద్దరే వైఎస్.జగన్మోహన్ రెడ్డి ఒకరు కాగా, మరొకరు కె.చంద్రశేఖర్ రావు అని ఆయన చెప్పుకొచ్చారు. ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి నేపథ్యంలో సీఎం కిరణ్ భవితవ్యమేమిటని విలేకరులు ప్రశ్నించగా.. భగవంతుడు కరుణిస్తే తాను కూడా ముఖ్యమంత్రిని అవుతానని ఆయన సమాధానమిచ్చారు. 

జగన్‌ను సీఎంను చేయాలని సంతకాలు పెట్టిన కిరణ్‌కుమార్‌రెడ్డి.. ప్రస్తుతం ముఖ్యమంత్రి అయ్యాడని, అలాంటి ఆయనకు జగన్ గురించి మాట్లాడే నైతికహక్కు లేదని చెప్పారు. కాంగ్రెస్ అధిష్టానాన్ని కిరణ్ మోసగించి సీఎం పదవిలో కూర్చున్నారని విమర్శించారు. ఉప ఎన్నికల ఫలితాల అనంతరం మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి రాజీనామా చేయడాన్ని స్వాగతిస్తున్నట్టు చెప్పారు. 

అలాగే, పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కూడా రాజీనామా చేయాలని శంకర్రావు డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి మూడు తప్పుడు జీవోలు విడుదల చేయడం వల్లనే కోర్టులో కేసు వేశానని, ఆయన జైలుకు పోవడం ఖాయమని శంకరన్న అభిప్రాయపడ్డారు.