వైయస్సార్ బాటలో కెసిఆర్, నేతలకు గాలం

వైయస్సార్ బాటలో కెసిఆర్, నేతలకు గాలం

దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి మార్గాన్ని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు ఎంచుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఉప ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత కాంగ్రెసును టార్గెట్ చేసుకుని, ఆ పార్టీకి చెందిన పార్లమెంటు సభ్యులను, శాసనసభ్యులను తమ వైపు లాక్కునేందుకు గాలం వేస్తున్నారట. రెండో సారి విజయం సాధించిన తర్వాత వైయస్ రాజశేఖర రెడ్డి తెలుగుదేశం, తెరాస నాయకులకు గాలం వేసి ఆ పార్టీల అగ్రనేతలను ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించారు. అదే మార్గాన్ని కెసిఆర్ ఎంచుకున్నట్లు చెబుతున్నారు.

తాజాగా, ఐదుగురు తెలంగాణ కాంగ్రెసు లోకసభ సభ్యులకు ఆయన గాలం వేసే ప్రయత్నాలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. పొన్నం ప్రభాకర్, మందా జగన్నాథం, జి. వివేక్, గుత్తా సుఖేందర్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిలను తెరాసలోకి తీసుకోవడానికి ఆయన విశ్వప్రయత్నాలు చేస్తున్నారని అంటున్నారు. శాసనసభ్యులకు కూడా ఆయన గాలం వేస్తున్నారట. రాజీనామాలు చేయండి, రండి, గెలవండి అనే నినాదం ఇప్పుడు కెసిఆర్ నోట వినిపిస్తోందని అంటున్నారు.