వైయస్‌కు అప్పుడే చెప్పా: సిబిఐ ఎదుట బొత్స

వైయస్‌కు అప్పుడే చెప్పా: సిబిఐ ఎదుట బొత్స

ఎమ్మార్ కేసులో తన పాత్ర ఏమీ లేదని ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ చెప్పారు. అప్పట్లో జారీ చేసిన జీవోలపై తాను అభ్యంతరాలు వ్యక్తం చేశానని, వాటిని దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకపోయిందని సిబిఐకి తెలిపారు. ఎమ్మార్ కేసులో బొత్సను సిబిఐ 17వ సాక్షిగా చేర్చింది. ఈ ఏడాది జనవరి 8న ఆయన నుంచి వాంగ్మూలం సేకరించింది. ఆయన వాంగ్మూలం తాజాగా వెలుగులోకి వచ్చింది. నా అభ్యంతరాలన్నీ అప్పటి పరిశ్రమల శాఖ కార్యదర్శి, ఎపిఐఐసి ఎండిలకు తెలిపానని, వైఎస్‌కు రహస్య నోట్‌ ద్వారా అన్నీ వివరించానని అయినా, జీవోల్లో జరగాల్సిన మార్పులు జరిగిపోయాయని బొత్స తన వాంగ్మూలంలో వివరించారు. జివో నెంబర్ 22లో జరిగిన గోల్‌మాల్ గురించి తనకు తెలిసింది తక్కువే నన్నారు. ఎమ్మార్ ప్రాజెక్టుకు తక్కువ తక్కువ రేటుకే భూములు కేటాయించడంపై నేను అభ్యంతరం తెలిపానని, అప్పటి ఎపిఐఐసి ఎండి ఈ విషయాన్ని పట్టించుకోలేదని, ఎండి సిఫార్సులనే అప్పటి పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి ఆమోదించారని, నాటి సిఎం, ఆర్థిక మంత్రి, ముఖ్యకార్యదర్శి కూడా ఆమోదించారని అందుకే పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి సిఫార్సునే నేనూ ఆమోదించానని చెప్పారని తెలుస్తోంది.

ఎమ్మార్‌తో తెలుగుదేశం ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందం పారదర్శకంగా లేదని, దానిని సమీక్షించేందుకు మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేసి, దాని సిఫార్సుల మేరకు ఒప్పందంలో మార్పులకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని చెప్పారు. రెండు ఎస్వీవీలకు, మూడుగా మార్చేందుకు, వాటాలోనూ మార్పులకు జివో నెం.14ని 2005 జనవరి 11న జారీ చేసినట్లు తెలిపారు. ఆ జివోలో కొన్ని అంశాలు సరిగా లేవంటూ జనవరి 27న దానికి సవరణ తెస్తూ జివో నెం.22 జారీ అయిందన్నారు. భారీ పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్న తనకు సవరణలకు సంబంధించిన దస్త్రాన్ని ముందుగా తనకు పంపలేదని, జివో జారీ అయ్యాక ఆ దస్త్రం తనకు చేరిందని చెప్పారు. దీనిపై తన దృష్టికి గాని, అప్పటి ముఖ్యమంత్రి దృష్టికి గానీ ముందుగా తీసుకు రాలేదన్నారు.

ఇందులో ఉన్న లోపాలను గమనించి తాను ఫిబ్రవరి 7న తన అభ్యంతరాలను అందులో లిఖిత పూర్వకంగా పేర్కొన్నట్లు తెలిపారు. మార్చి 2న ముఖ్యమంత్రి వైయస్‌తో జరిగిన సమావేశంలో వీటిపై చర్చించినప్పటికీ సమస్య పరిష్కారం కాలేదన్నారు. దీంతో మార్చి 17న సింకు రహస్య నివేదికను పంపించానని తెలిపారు. తాను పంపిన నివేదికను మార్చి 23న జరిగిన సమావేశపు తీర్మానాల్లో చేర్చినట్లు సిఎం తనకు వివరణ పంపారని అన్నారు. ఎమ్మార్ ప్రాజెక్టులో పలు అంశాలకు సంబంధించి తాను లేవనెత్తిన అభ్యంతరాలకు అధికారులు వివరణ ఇవ్వలేదని సూచనలనూ పట్టించుకోలేదని తెలిపారు. ఎమ్మార్‌కు ఇవ్వదలచిన భూమి ధరను ఎకరా రూ.29 లక్షల నుంచి రూ.40 లక్షలకు పెంచాలని మొదట ప్రతిపాదించిన ఐఏఎస్‌లు అనంతరం ఆ విషయాన్ని విస్మరించారన్నారు.