సిఎంతో గొడవ పడలేదు: బొత్స

సిఎంతో గొడవ పడలేదు: బొత్స

తాను ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో గొడవ పడలేదని పిసిిస అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. ఎసిబి విజయనగరం సిఐని పై అధికారి దుర్భాషలాడడం తనకు బాధ కలిగించిందని, ఆ విషయం తాను ముఖ్యమంత్రికి చెప్పానని ఆయన శనివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. ఎసిబి విజయనగరం సిఐ ఎవరో తనకు తెలియదని ఆయన అన్నారు. ఉప ఎన్నికల్లో ఓటమికి తనను, ముఖ్యమంత్రిని టార్గెట్ చేసి విమర్శలు చేస్తే తప్పేమిటని ఆయన అడిగారు. మంత్రి వర్గ నిర్ణయాలతో తమకు సంబంధం లేదని తాను అనలేదని ఆయన చెప్పారు. 2004లో తమ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరిగిన నిర్ణయాలకు అన్నింటికీ మంత్రులు బాధ్యుత వహిస్తారని, అయితే తెర వెనక జరిగిన వ్యవహారాలతో తమకు సంబంధం లేదని ఆయన అన్నారు. 

దోచింది దాచుకోవడానికే వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ వర్గానికి చెందిన నాయకులు ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్నారని ఆయన విమర్శించారు. అక్రమాలకు సంబంధించి వాస్తవాలు బయటకు వస్తాయని ఆయన అన్నారు. కర్ణాటకలో శ్రీరాములు గెలిస్తే అదంతా కరెక్టు అని అనగలమా అని ఆయన అడిగారు. అటువంటప్పుడు అన్నా హజారేలాంటివాళ్లు చేస్తున్న పోరాటానికి అర్థం లేదని ఆయన అన్నారు. విద్యుత్ చార్జీలు పెంచబోమని తాము ఎన్నికల ప్రణాళికలో హామీ ఇవ్వలేదని ఆయన చెప్పారు. ప్రభుత్వ నిర్ణయాలకు సంబంధించి తాము ఎలాంటి విచారణకైనా సిద్ధమని ఆయన అన్నారు. తప్పు చేసినట్లు రుజువైతే తల దించుకుంటామని ఆయన చెప్పారు. ఓ ప్రయోజనం కోసమైతే భూమిని కేటాయించామో ఆ ప్రయోజనం కోసం వాడకపోతే ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఆయన చెప్పారు.