బాబును మేమే నిలబెట్టాం: హరికృష్ణ

బాబును మేమే నిలబెట్టాం: హరికృష్ణ

 తమ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిపై తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యుడు నందమూరి హరికృష్ణ మాటల దాడిని మరింత పెంచారు. పార్టీ వేరు, కుటుంబ వేరని చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను ఆయన కౌంటర్ చేశారు. తెలుగుదేశం పార్టీ, నందమూరి కుటుంబం వేర్వేరు కాదని ఆయన ఓ ప్రముఖ తెలుగు టీవి చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్నారు. పార్టీ అధ్యక్షుడిగా చంద్రబాబును నిలబెట్టింది నందమూరి కుటుంబమేనని ఆయన అన్నారు. చంద్రబాబు అధ్యక్షుడిగా ఉంటే బాగుంటుందని తాము నిలబెట్టామని ఆయన అన్నారు. పార్టీ అధ్యక్షుడిని మార్చాలనే డిమాండ్ పార్టీ కార్యకర్తల నుంచి రావాలని ఆయన అన్నారు. ఏదైనా ప్రజల నుంచే రావాలని ఆయన అన్నారు. 

కాంగ్రెసుకు చంద్రబాబు మద్దతిస్తే తానే అడ్డుపడుతానని, తాను ప్రజల్లోకి వెళ్తానని ఆయన అన్నారు. 2014లో అధికారం తమ పార్టీదేనని, పార్టీ పూర్వవైభవం సంతరించుకుంటుందని ఆయన అన్నారు. మిగతా పార్టీ అధికారం గురించి కలలు కంటున్నాయని, కానీ టిడిపి అధికారంలోకి వస్తుందని ఆయన అన్నారు. పార్టీ అధ్యక్షుడిగా ఎవరుండాలనేది కార్యకర్తల ఇష్టమని ఆయన అన్నారు. తన బిడ్డ జూనియర్ ఎన్టీఆర్ పార్టీ కోసం 2009లో ప్రాణత్యాగానికి కూడా సిద్ధపడ్డాడని ఆయన అన్నారు. జూనియర్ ఎన్టీఆర్ పార్టీ కోసం పనిచేస్తారని ఆయన చెప్పారు. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ తన సినిమాలు తాను చేసుకుంటున్నాడని ఆయన చెప్పారు. పార్టీని ఛిన్నాభిన్నం చేయడానికి తాను రాలేదని, పార్టీని నిలబెట్టడానికే మాట్లాడుతున్నానని ఆయన అన్నారు. 

చంద్రబాబు జాతీయ రాజకీయాలపై దృష్టి పెట్టాలనే అంశంపై పార్టీలో అంతర్గత చర్చ జరగాలని ఆయన అన్నారు. పార్టీ నాయకులు కొందరు కాంగ్రెసుతో కుమ్మక్కయ్యారని, ఒక్క విషపు చుక్క మొత్తం పాలన్నింటినీ విషపూరితం చేస్తుందని ఆయన అన్నారు. కొందరు పార్టీ నేతల వల్ల పార్టీ నాశనమవుతోందని ఆయన అన్నారు. కాంగ్రెసు మోచేతి నీళ్లు తాగే వంశం తమది కాదని ఆయన అన్నారు. పార్టీలో కార్యకర్తలకు ప్రాధాన్యం పెంచాలని, తమను పట్టించుకోవడం లేదని కార్యకర్తలు భావిస్తున్నారని ఆయన అన్నారు.