జగన్ ఆరెస్టు పుకార్లు

జగన్ ఆరెస్టు పుకార్లు

ప్రత్యేక కోర్టులో సిబిఐ చార్జిషీట్ దాఖలు చేసిన నేపథ్యంలో వైయస్సార్ కాంగ్రెసు అధ్యక్షుడు వైయస్ జగన్ ఏ క్షణంలోనైనా అరెస్టు కావచ్చుననే పుకార్లు ముమ్మరమయ్యాయి. దీంతో పార్టీ కార్యకర్తలు పెద్ద యెత్తున హైదరాబాదు చేరుకుంటున్నారు. వైయస్ జగన్ ఆస్తుల కేసులో సిబిఐ శనివారం సాయంత్రం చార్జిషీట్ దాఖలు చేసింది. ఇందులో జగన్‌ను మొదటిస ముద్దాయిగా చేర్చారు. ప్రస్తుతం వైయస్ జగన్ గుంటూరు జిల్లాలో ఉన్నారు. గుంటూరు జిల్లాలో పోలీసు బందోబస్తును పెంచారు. పెద్ద యెత్తున పోలీసులను మోహరించారు. ఈ స్థితిలో పోలీసులకు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కార్యకర్తలకు మధ్య అమరావతి రోడ్డులో వాగ్వివాదం చెలరేగింది. జగన్‌ను అరెస్టు చేసేందుకే పోలీసులు వచ్చారంటూ పార్టీ కార్యకర్తలు అనుమానాలు వ్యక్తం చేశారు. 

రాష్ట్రవ్యాప్తంగా పోలీసులను అప్రమత్తం చేశారు. వైయస్ జగన్‌పై ఏమీ లేదని, పిసి యాక్టు కింద మాత్రమే కేసు పెట్టారని ఆయన తరఫు న్యాయవాది అశోక్ రెడ్డి మీడియా ప్రతినిధులతో చెప్పారు. జగన్ నేరపూరిత కుట్రకు పాల్పడ్డారని సిబిఐ అభియోగం మోపినట్లు తెలుస్తోంది. వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వ హయాంలో ప్రయోజనాలు పొందడం వల్లనే సంస్థలు జగన్ సంస్థల్లో పెట్టుబడులు పెట్టారని సిబిఐ ఆరోపించింది. అరబిందో ఫార్మాకు మహబూబ్‌నగర్‌లో సెజ్‌ను మంజూరు చేశారు. ఈ సంస్థ జగన్ సంస్థల్లో పది కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడులు పెట్టింది. పోలెపల్లి సెజ్‌లో హెటిరో డ్రగ్స్‌కు వైయస్ ప్రభుత్వ హయాంలో సెజ్ మంజూరైంది. 

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు పలువురు కూడా హైదరాబాదుకు చేరుకుంటున్నట్లు తెలుస్తోంది. వైయస్ జగన్ తన ఓదార్పు యాత్రను శనివారం సాయంత్రం గుంటూరు జిల్లాలో ముగించుకుని హైదరాబాద్ రావాల్సి ఉంది.