కన్వీనర్‌గా ఎర్రబెల్లి రాజీనామా

 కన్వీనర్‌గా ఎర్రబెల్లి రాజీనామా

 తెలుగుదేశం తెలంగాణ ఫోరంలో మరోసారి ముసలం పుట్టింది. తెలుగుదేశం పార్టీ తెలంగాణ ఫోరం కన్వీనర్ పదవికి ఎర్రబెల్లి దయాకర రావు రాజీనామా చేశారు. మూడు రోజుల క్రితమే ఆయన గుట్టు చప్పుడు కాకుండా తన రాజీనామా లేఖను ఎర్రబెల్లి దయాకర్ రావు పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి అందజేసినట్లు చెబుతున్నారు. అయితే, ఎర్రబెల్లి రాజీనామాను చంద్రబాబు తిరస్కరించినట్లు చెబుతున్నారు. రాజ్యసభ ఎన్నికలకు అభ్యర్థుల ఎంపికను నిరసిస్తూ, ఉప ఎన్నికల్లో పార్టీ ఓటమికి బాధ్యత వహిస్తూ ఆయన రాజీనామా చేసినట్లు చెబుతున్నారు. ఫోరం కన్వీనర్‌గా సమర్థంగానే పనిచేశారంటూ చంద్రబాబు ఎర్రబెల్లికి నచ్చజెప్పినట్లు తెలుస్తోంది. 

కాగా, గతంలో తెలుగుదేశం తెలంగాణ ఫోరం కన్వీనర్‌‌గా నాగం జనార్దన్ రెడ్డి వ్యవహరించేవారు. ఫోరంలో పుట్టిన ముసలం కారణంగా ఇదే తరహాలో నాగం జనార్దన్ రెడ్డి రాజీనామా చేశారు. ఆ తర్వాత తెలంగాణపై చంద్రబాబు వైఖరిని నిరసిస్తూ నాగం జనార్దన్ రెడ్డి శానససభా సభ్యత్వానికి, పార్టీకి రాజీనామా చేశారు. ఆ తరుణంలో పార్టీ తెలంగాణ ఫోరం కన్వీనర్‌గా ఎర్రబెల్లి దయాకర్ రావు ముందుకు వచ్చారు. అయితే, మొదటి నుంచి తెలంగాణ ప్రాంత శాసనసభ్యుడు మోత్కుపల్లి నర్సింహులుతో విభేదాలు చోటు చేసుకున్నాయి. పార్టీకి, శానససభా సభ్యత్వానికి కూడా ఎర్రబెల్లి దయాకర్ రావు రాజీనామా చేసినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే, ఈ విషయం నిర్ధారణ కావడం లేదు.