జగన్ పేరు వద్దని సిబిఐపై కేంద్రం ఒత్తిడి

జగన్ పేరు వద్దని సిబిఐపై కేంద్రం ఒత్తిడి

 వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి, కేంద్ర ప్రభుత్వంపై తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం తీవ్రస్థాయిలో విరుచుకు పడ్డారు. ఆస్తుల కేసుకు సంబంధించిన ఛార్జీషీటులో జగన్ పేరు ఉండరాదని సిబిఐపై కేంద్రం ఒత్తిడి తీసుకు వస్తోందని ఆయన ఆరోపించారు. కర్నాటక మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డి అరెస్టు తర్వాత జగన్ ఢిల్లీ వెళ్లడంతో సీన్ ఒక్కసారిగా మారిందన్నారు. దోచుకోవడానికి జగన్ సచివాలయానికి రావాల్సిన అవసరం లేదన్నారు. అధికారులే ఆయన వద్దకు వచ్చేవారన్నారు. కాగ్ నివేదికకు ముందు దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డిని మహానేత అన్న వారు ఇప్పుడు మహాదోపిడీ నేత అంటారా అని ప్రశ్నించారు. టిడిపి ఎమ్మెల్యేలను ప్రలోభ పెడుతూ ఫోన్లు వస్తున్నాయని ఆయన అన్నారు. సరైన సమయంలో ఆధారాలతో సహా నిరూపిస్తామన్నారు. తెలంగాణ సమస్య తీర్చేందుకు కృషి చేస్తామన్నారు.

ప్రభుత్వం అక్రమంగా భూకేటాయింపులు జరిపిందని, అక్రమ కేటాయింపులు ముడుపులు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి కంపెనీల్లోకి వెళ్లాయని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం మీడియా సమావేశంలో అన్నారు. భూకేటాయింపుల్లో తీవ్రమైన అక్రమాలు జరిగినట్లు కాగ్ నివేదిక తేల్చిందన్నారు. నిబంధనలకు విరుద్ధంగా భూములను తాకట్టు పెట్టుకునేందుకు, అమ్ముకునేందుకు అనుమతులు ఇచ్చారని ఆరోపించారు. ఇంత పెద్ద కుంభకోణం దేశంలో ఎక్కడా జరగలేదన్నారు. అడ్డగోలుగా కేటాయింపులు జరిపి వాటి ముడుపులను జగన్ కంపెనీల్లోకి మళ్లించారన్నారు. కాకినాడలో ఓఎన్‌జిసికి ఇచ్చిన భూములను వెనక్కి తీసుకొని ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టారని దుయ్యబట్టారు. బ్రాహ్మణికి ఎనిమిది వేల ఎకరాలు కావాలంటే పదివేల ఎకరాలకు పైగా భూమిని అప్పగించారని విమర్శించారు.

జగన్ పైన ఆయన సాక్షి పత్రిక పైనా మండిపడ్డారు. రాజకీయ నేతలను, కోర్టులను, మీడియాను తన పత్రిక ద్వారా ఆయన  బ్లాక్ మెయిల్ చేస్తున్నారన్నారు. డబ్బుతో నేతలను కొనుగోలు చేస్తున్నారని విమర్శించారు. జగన్ అవినీతి కాంగ్రెస్ ప్రోత్సాహంతోనే జరిగిందన్నారు. కాంగ్రెస్ పార్టీ అండ ఆయనకు ఉందన్నారు.