టీడీపీలో ముసలం!

టీడీపీలో ముసలం!

తెలుగుదేశం పార్టీలో ముసలం తలెత్తిందా? పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు నందమూరి హరికృష్ణల మధ్య మాటలు యుద్ధం ఆరంభమైన నేపథ్యంలో.. ఈ తరహా సందేహం ఉత్పన్నమవుతోంది. 

గత కొంతకాలంగా పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటూ వస్తున్న హరికృష్ణ.. పార్టీ ఆవిర్భావమై 30 యేళ్లు అయిన నేపథ్యంలో ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. ఆ సమయంలో ఆయన టీడీపీ పార్టీ నేతలపై విమర్శలు గుప్పించారు. పార్టీ అధినేత చంద్రబాబుపై పరోక్షంగా విమర్శనాస్త్రాలు సంధించారు. 

జిల్లా స్థాయి నుంచి పై స్థాయి వరకు పార్టీలోని నాయకుల్లో లోపం ఉందని అందువల్లే పార్టీని నిస్సత్తువ ఆవహించిందని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీలో ఉండే ప్రతి నేతా పల్లకీలో కూర్చోవాలని భావించరాదనీ, పల్లకీని మోసేందుకు కూడా సిద్ధంగా ఉండాలని హితబోధ చేశారు. 

ప్రస్తుతం పార్టీ పునాదులు బాగున్నప్పటికీ.. కొన్ని ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నట్టు చెప్పారు. ఇలాంటి తరుణంలో పార్టీని రక్షించాల్సిన బాధ్యత కార్యకర్తలపైనే ఉందన్నారు. ఇది ప్రజల పార్టీ అని, ప్రజల కోసం పుట్టిన పార్టీ అనీ, అలాంటి పార్టీని వారే రక్షించాలంటూ విజ్ఞప్తి చేశారు. 

హరికృష్ణ హస్తినలో అలా వ్యాఖ్యానించారో లేదో.. హైదరాబాద్‌లో చంద్రబాబు కౌంటర్ అటాక్ ఇచ్చారు. కుటుంబం వేరు.. రాజకీయాలు వేరంటూ సెలవిచ్చారు. కుటుంబ సభ్యులంతా కలిసి భోజనం చేసినంత మాత్రాన పార్టీ క్రమశిక్షణను ఉల్లఘింస్తే సహించే ప్రసక్తే లేదంటూ హరికృష్ణకు ప్రత్యక్ష హెచ్చరికే చేశారు. వీరిద్దరి మధ్య ఈ తరహా ఘర్షణ వాతావరణం చోటు చేసుకోవడానికి బలమైన కారణమే లేకపోలేదు.

తన తండ్రి ఎన్టీఆర్ పేదవారి కోసం, కష్టించి పనిచేసే కార్యకర్తల కోసం పార్టీని ప్రారంభిస్తే.. పార్టీ ఇప్పుడు పూర్తిగా వేలాది కోట్లకు పడగలెత్తిన కార్పొరేట్ రంగానికి అమ్ముడు పోయిందన్నదే హరికృష్ణ ఆవేదనంతా. 

టీడీపీలో మధుకాన్ సంస్థ అధిపతి నామా నాగేశ్వర్‌ రావు, సృజనా సంస్థల అధిపతి సుజనా చౌదరి, రాంకీ గ్రూపుకు చెందిన ఎం.వేణుగోపాల్ రెడ్డిలు కార్పొరేట్ రంగానికి చెందిన వారు. తాజాగా రాజ్యసభకు ఎంపికైన సీఎం.రమేష్, దేవేందర్ గౌడ్‌లు ఇలాంటివారే. దీంతో వీరి ఎంపికపై హరికృష్ణ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. 

సీఎం రమేష్ వ్యాపార రంగానికి చెందినవారు కాగా, దేవేందర్ గౌడ్‌కు కూడా రియల్ ఎస్టేట్, ఫార్మా పరిశ్రమతో సంబంధాలున్నాయన్నది హరికృష్ణ వాదన. ఫలితంగా పార్లమెంటులోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం రాజకీయ పార్టీ కార్యాలయం గాక ఒక కార్పొరేట్ కార్యాలయ స్థాయికి దిగజారిపోయిందని, అందుకే పార్టీ అధినేత వైఖరి పట్ల తీవ్ర నిరసనను వ్యక్తం హరికృష్ణ వ్యక్తం చేశారు. 

ఇలా తనలోని ఆవేదన, అసంతృప్తికి కొనసాగింపుగానే హస్తినలో హరికృష్ణ ఈ తరహా వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తోంది. మొత్తంమీద హరికృష్ణ వ్యాఖ్యలు, చంద్రబాబు కౌంటర్ అటాక్, ఉప ఎన్నికల్లో ఎదురైన పరాభవం, పార్టీలో చోటు చేసుకుంటున్న వలసలు, తెలంగాణ అంశం పరిణామాలు.. టీడీపీని ఎక్కడుకు తీసుకెళ్లతాయోనన్న భయం టీడీపీ శ్రేణులకు పట్టుకుంది.