సిఎం వసూళ్ల దుకాణాలు తెరిచారు

సిఎం  వసూళ్ల దుకాణాలు తెరిచారు

 ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రాష్ట్రంలో వసూళ్ల దుకాణాలు తెరిచారని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆరోపించారు. ఒక్క హైదరాబాదులోని అరడజను దాకా వసూళ్ల కేంద్రాలున్నాయని ఆయన శనివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. కిరణ్ కుమార్ రెడ్డి నుంచి సూట్‌కేసులు అందడం వల్లనే ముఖ్యమంత్రిని మార్చేది లేదని ఎఐసిసి పరిశీలకుడు కృష్ణమూర్తి ప్రకటించారని ఆయన వ్యాఖ్యానించారు. విద్యుత్ చార్జీల పెంపుపై ఆయన తీవ్రంగా మండిపడ్డారు. 

విద్యుత్ చార్జీల పెంపు వల్ల ప్రజలపై 4,442 కోట్ల రూపాయల భారం పడిందని ఆయన అన్నారు. ప్రభుత్వ అసమర్థత వల్ల, అవినీతి వల్ల విద్యుత్ చార్జీలు పెరిగాయని ఆయన అన్నారు. ప్రభుత్వంలో జవాబుదారీ తనం లేకుండా పోయిందని ఆయన విమర్సించారు. విద్యుత్ శాఖకు మంత్రి కూడా లేకపోవడాన్ని ఆయన తప్పు పట్టారు. విద్యుత్ చార్జీల పెంపుపై తాము పోరాటం చేస్తామని ఆయన చెప్పారు. వచ్చే నెల 4వ తేదీన నియోజకవర్గాల్లో నిరసనలు చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు కరువయ్యాయని ఆయన అన్నారు. సంగారెడ్డిలో ప్రభుత్వ చేతకానితనం వల్లనే ఘర్షణలు చెలరేగాయని ఆయన ఆరోపించారు. 

ఎన్నికల ముందు గొప్పలు చెప్పిన ప్రభుత్వం ఇప్పుడు విద్యుత్ చార్జీలను విపరీతంగా పెంచిందని ప్రభుత్వంపై చంద్రబాబు ధ్వజమెత్తారు. విద్యుత్ చార్జీల పెంపుకు నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని సబ్ స్టేషన్లవద్ద ధర్నాలు చేపడతామని అన్నారు. ఇళ్లకు 18 శాతం మేర విద్యుత్ చార్జీలు పెంచారని, 100 యూనిట్లు దాటితే 90 పైసలు అదనంగా చెల్లించాల్సి వస్తుందని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు.