తెలంగాణ సమస్యను పరిష్కరిస్తా

తెలంగాణ సమస్యను పరిష్కరిస్తా

 ఓ సీనియర్ రాజకీయ నాయకుడిగా తాను తెలంగాణ సమస్యను పరిష్కరిస్తానని తెలుగుదేశం అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అన్నారు. తెలంగాణ సమస్య పరిష్కారానికి తన కర్తవ్యాన్ని నెరవేరుస్తానని ఆయన అన్నారు. ఎబిఎన్ ఆంధ్రజ్యోతి టీవీ చానెల్ శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రజలు తనపై ఎంతో అభిమానం చూపారని, అందువల్ల తెలంగాణ సమస్య పరిష్కారానికి ఏం చేయాలో చూడాల్సిన బాధ్యత కూడా తనపై ఉందని ఆయన అన్నారు. తెలంగాణ విషయంలో కాంగ్రెసు రాజకీయ సుడిగుండాన్ని సృష్టించిందని ఆయన విమర్శించారు.

తాను కాలానికి ముందున్నానని, 2004 ఎన్నికల్లో తాను ఉచిత విద్యుత్తు ఇచ్చి సంక్షేమ పథకాలు అమలు చేసి ఉంటే గెలిచి ఉండేవాడినని, 2009 ఎన్నికలు వచ్చే సరికి చిరంజీవి ప్రజారాజ్యం వల్ల, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) వల్ల ఓడిపోయామని ఆయన చెప్పారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటును చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ చీల్చిందని, పొత్తులో భాగంగా ఇచ్చిన సీట్లలో తెరాస పది సీట్లు కూడా గెలవలేదని, తెరాసకు కేటాయించిన సీట్లన్నీ కాంగ్రెసు గెలుచుకుందని ఆయన అన్నారు. తమకు సంక్షోభం కొత్త కాదని, అన్ని సమస్యలను అధిగమించి మళ్లీ అధికారంలోకి వస్తామని, ఆంధ్రప్రదేశ్‌ను ప్రపంచ చిత్రపటం మీద నిలబెడుతానని ఆయన అన్నారు. 

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ కులాన్ని, మతాన్ని అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేస్తున్నారని ఆయన అన్నారు. దోచింది దాచుకోవడ విశ్వసనీయత కాదని ఆయన అన్నారు. రాష్టంలో వైయస్సార్ చేసిందేమీ లేదని, తమిళనాడులో కన్నా ఎక్కువ సంక్షేమ పథకాలు ఏమీ అమలు చేయలేదని, తాను సృష్టించిన సొమ్ముతో తొలి విడత వైయస్సార్ పాలన సాగించారని ఆయన అన్నారు. 2004కు ముందు వైయస్ కుటుంబం ఆదాయమెంత, ఆ తర్వాత ఎంతనేది అర్థమవుతూనే ఉన్నదని ఆయన అన్నారు. 20 ఏళ్ల క్రితం ప్రారంభించిన తమ కుటుంబానికి చెందిన హెరిటేజ్‌కు ఇప్పటి వరకు కార్పొరేట్ ఆఫీసు లేదని ఆయన అన్నారు. అవినీతి సొమ్ముతో పత్రిక, టీవీ చానెల్ పెట్టిన పార్టీ దేశంలో లేదని ఆయన వైయస్ జగన్‌ను ఉద్దేశించి అన్నారు.