వైయస్ విజయమ్మ ఏం చెబుతారు?: టిడిపి ప్రశ్న

భూకేటాయింపులపై తాము చేసిన విమర్శలు అక్షర సత్యమని కాగ్ నివేదికతో తేటతెల్లమయిందని తెలుగుదేశం పార్టీ నేతలు పయ్యావుల కేశవ్, గాలి ముద్దుకృష్ణమ నాయుడు, అశోక్ గజపతి రాజు గురువారం మీడియా సమావేశంలో అన్నారు. కాగ్ తన నివేదికలో పట్టిన తప్పులకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు, పులివెందుల శాసనసభ్యురాలు వైయస్ విజయమ్మ ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. ఇందు, ఓఎంసి, బ్రాహ్మణి సంస్థలకు కేటాయించిన భూములపై కాగ్ నివేదిక ఇచ్చిందని విజయమ్మ ఇప్పుడు ఏం మాట్లాడతారన్నారు. భూములు ప్రభుత్వానివి అయితే ప్రయోజనాలు మాత్రం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్‌వి అని విమర్శించారు.

జగన్‌కు సంబంధించిన భూములు సిఎం ఎందుకు రద్దు చేయలేదని ప్రశ్నించారు. వారిద్దరి మధ్య మ్యాచ్ ఫిక్సింగ్ ఉందని విమర్శించారు. సభ సజావుగా నడవక పోవడానికి స్పీకర్, ముఖ్యమంత్రి కారణమని విమర్శించారు. బడ్జెట్ సమావేశాలు నిరుమయోగమయ్యాయన్నారు. సభలో విప్‌ల సంఖ్య మాత్రమే పెరిగిందని ఎద్దేవా చేశారు. సభ జరిగిన తీరు ప్రజాస్వామ్యానికి ముప్పు అన్నారు. బడ్జెట్ సమావేశాలు చీకటి రోజులన్నారు. తెలంగాణ, అవినీతిపై చర్చించేందుకు ప్రభుత్వానికి భయమెందుకన్నారు.

కాగా 2010-11 ఆర్థిక సంవత్సరానికి కాగ్ నివేదికను ప్రభుత్వం గురువారం ఉదయం అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. ఎపిఐఐసి పనితీరును కాగ్ తప్పుబట్టింది. ఆర్థిక ప్రమాణాలను పరిరక్షించక పోవడం వల్ల రూ.94 కోట్ల నష్టం వాటిల్లిందని, ప్రభుత్వం రంగ సంస్థల్లో నిబంధనలను పాటించకపోవడం వల్ల ప్రభుత్వానికి రూ.548 కోట్ల నష్టం జరిగిందని కాగ్ నివేదిక వెల్లడించింది. బ్రహ్మణి భూకేటాయింపులు, ఓఎంసి భూ కేటాయింపుల, బళ్లారి ఐరన్ ఓర్ భూకేటాయింపులపై కాగ్ తన నివేదికలో ప్రస్తావించింది.

అలాగే వాన్‌పిక్, ఐటిపి భూ కేటాయింపులను కూడా కాగ్ ప్రస్తావించింది. ఎమ్మార్ భూకేటాయింపుల వల్ల ఎపిఐఐసి ప్రభుత్వం ఆర్థిక పరమైన విపత్తులకు గురికావచ్చని కాగ్ పేర్కొంది. ఎమ్మార్ కేసులో సిబిఐ అభియోగాలను కాగ్ ద్రువీకరించింది. ఎమ్మార్ ఒక ఎస్పీవీలో రూ.120 కోట్లు, మరో ఎస్పీవీలో రూ.109 కోట్లు నష్టం జరిగినట్లు కాగ్ వెల్లడించింది. ప్రభుత్వ చర్యల కారణంగా వివిధ సంస్థలకు, వ్యక్తులకు రూ.1784 కోట్ల అనుచిత లబ్ది చేకూరిందని కాగ్ తెలిపింది. 2006-11 లో ప్రభుత్వ భూకేటాయింపులో తీవ్ర అక్రమాలు జరిగాయిన కాగ్ ఆరోపించింది.

సామాజ ఆర్థిక ప్రయోజనాలను ప్రభుత్వం విస్మరించిందని కాగ్ నివేదికలో పేర్కొంది. తాత్కాలిక ప్రాతిపదికన తక్కువ ధరలకే భూములను కేటాయించారని కాగ్ తెలిపింది. నానక్‌రామ్ ఐటీ పార్క్‌లో తక్కువ ధరలకు భూ కేటాయింపులు జరగడం వల్ల రూ.30 కోట్లు నష్టం వాటిల్లిందని, మంచిరేవుల ఐటీ పార్క్‌లో రూ.126 కోట్ల ఆదాయం వదులుకోవాల్సి వచ్చిందని కాగ్ పేర్కొంది. విద్యుత్ శాఖలో ఎనర్జీ మీటర్ల కొనుగోలు లాభం చేకూర్చలేదని కాగ్ తన నివేదికలో వెల్లడించింది.