వైయస్‌పై చిరంజీవి ప్రశంసలు

వైయస్‌పై చిరంజీవి ప్రశంసలు

 తిరుపతి శాసనసభ్యుడు, కాంగ్రెసు పార్టీ నేత చిరంజీవి మంగళవారం దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుపై ప్రశంసలు కురిపించారు. వైయస్ రాజశేఖర రెడ్డి తన ప్రత్యర్థులను ఎలా ఎదుర్కొనే వారు తాను చూశానని అన్నారు. చంద్రబాబు నాయుడు నిత్య విద్యార్థిలా రోజు సభకు రావడం అభినందనీయమని కొనియాడారు. చిరంజీవి మంగళవారం రాజ్యసభ అధికార ధ్రువీకరణ పత్రాన్ని తీసుకున్నారు. ఈ కార్యక్రమానికి ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు, రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, పలువురు మంత్రులు హాజరయ్యారు. అనంతరం ఆయన కాంగ్రెసు పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు.

తాను ఈ నెల 29న శాసనసభ్యత్వానికి రాజీనామా చేస్తానని చెప్పారు. అసెంబ్లీ సమావేశాలు ఆఖరు ఆ రోజే ఉంటాయని అదే రోజు రాజీనామా చేస్తానని చెప్పారు. ఏప్రిల్ 3వ తేదిన తాను రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేస్తానని చెప్పారు. ఈ మూడేళ్లలో నేతల నుండి ఎన్నో విషయాలు నేర్చుకున్నానని చెప్పారు. పార్టీలో ఎలాంటి అసంతృప్తి లేదన్నారు. చిన్న చిన్న అసంతృప్తులు సహజమేనన్నారు. తన ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెసులో విలీనం చేయడం వల్లనే పార్టీ బలోపేతం అయిందన్నారు. పిఆర్పీని తాను భేషరతుగా విలీనం చేసినట్లు చెప్పారు. తన వర్గం నేత, దేవాదాయ శాఖ మంత్రి రామచంద్రయ్య వ్యాఖ్యలకు పెడార్థాలు తీయవద్దని కోరారు.

ఆయన చేసిన వ్యాఖ్యలపై పిలిచి మాట్లాడతానని చెప్పారు. స్థానికంగా కొనసాగుతున్న సమస్యల పట్ల ఆయన అలా వ్యాఖ్యానించి ఉంటారని అభిప్రాయపడ్డారు. ఈ అసంతృప్తి టీ కప్పులో తుఫాను వంటిందన్నారు. కాంగ్రెసులో అందరి మధ్య ఉన్నవి సత్సంబంధాలే అన్నారు. ఇంత పెద్ద కాంగ్రెసులో అందరూ తనను బాగా ఆదరించారన్నారు. బ్లాక్ మెయిల్ రాజకీయాలు తమకు తెలియదన్నారు. అలాంటి దుస్థితి కూడా మాకు లేదన్నారు. చిరంజీవి మాట రామచంద్రయ్య నోట అనే వ్యాఖ్యలను ఆయన కొట్టి పారేశారు. అసెంబ్లీ తనకు రాజకీయ పాఠశాల వంటిది అన్నారు. అసెంబ్లీ సభ్యులు నాకు పాఠాలు నేర్పిన గురువులు అన్నారు.

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి స్వచ్ఛమైన, అవినీతిరహిత పాలన అందిస్తున్నారన్నారు. తమిళనాడు గవర్నర్ రోశయ్య మాటల చాతుర్యాన్ని ఆదర్శంగా తీసుకున్నానని అన్నారు. తిరుపతి ఉప ఎన్నికను తాను ప్రజలకు భారంగా భావించడం లేదన్నారు. ప్రజలకు మరిన్ని సేవలు అందించేందుకే రాజ్యసభకు వెళుతున్నానని అన్నారు. ప్రజలు కూడా వాటిని భారంగా భావించరన్నారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మళ్లీ అదే పదవికి పోటీ చేస్తే ప్రజలు భారంగా భావిస్తారన్నారు. కాగా రాజ్యసభ సభ్యుడిగా ఎంపికైన చిరంజీవికి తెలంగాణ రాష్ట్ర సమితి శాసనసభ్యులు అభినందనలు తెలియజేశారు. తెలంగాణ ఏర్పాటుకు సహకరించాలని ఆయనను కోరారు.