అలా ఐతే మాకు వ్యతిరేకమే

అలా ఐతే మాకు వ్యతిరేకమే

 కృష్ణా జిల్లా విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ మరోసారి ఉప ఎన్నికలపై తన జోస్యం చెప్పారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి వర్గం నేతల రాజీనామాతో ఖాళీ అయిన పదిహేడు అసెంబ్లీ, ఒక పార్లమెంటు స్థానాలతో పాటు చిరంజీవి రాజీనామాతో ఖాళీ అయిన తిరుపతి నియోజకవర్గంపై ఆయన స్పందించారు. స్థానిక సంస్థల ఎన్నికల కన్నా ముందే ఉఫ ఎన్నికలు జరిగితే ఫలితాలు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా వస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు. ఉప ఎన్నికలకు ముందే పురపాలక, స్థానిక సంస్థల ఎన్నికలు జరిగే అవకాశముందన్నారు.

లగడపాటి రాజగోపాల్ కడప జిల్లా బద్వేలు మండలం గొడుగునూరులో గురువారం జరిగిన ఓకార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే డాక్టర్ శివరామకృష్ణ రావుతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. కాగా ఇటీవల జరిగిన ఉప ఎన్నికల ఫలితాలపై లగడపాటి జోస్యం చెప్పిన విషయం తెలిసిందే.