సమావేశంలో ఎప్పుడూ చర్చించలేదు: అంబటి

సమావేశంలో ఎప్పుడూ చర్చించలేదు: అంబటి

ఎమ్మార్‌లో విల్లాలు, ప్లాట్ల ధరలపై ఎపిఐఐసి బోర్డు సమావేశంలో ఎప్పుడూ చర్చకు రాలేదని కార్పొరేషన్ మాజీ చైర్మన్, ప్రస్తుత వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు స్పష్టం చేశారు. ఎమ్మార్‌లో విల్లాలు, ప్లాట్లు కేటాయించాల్సిందిగా వచ్చిన అభ్యర్థనలను అప్పటి ఎపిఐఐసి ఎండికి పంపించానని కూడా తెలిపారు. అంబటిని 27వ సాక్షిగా పేర్కొంటూ సిబిఐ ఆయన వాంగ్మూలం సేకరించింది. ఎమ్మార్ ప్రాపర్టీస్ చైర్మన్‌తో నేను ఎప్పుడూ మాట్లాడలేదని, ఎమ్మార్ తరఫున కోనేరు ప్రసాద్ ఎపిఐఐసి కార్యాలయానికి వచ్చే వారని, ఎండితోనూ, నాతోనూ మాట్లాడేవారని, స్టైలిష్ హోమ్స్ ఎండి రంగారావు కూడా వచ్చి మాట్లాడేవారని, ఎమ్మార్‌లో విల్లా స్థలాలు కేటాయించాల్సిందిగా నన్ను చాలా మంది కోరారని, దీనిపై అప్పటి ఎపిఐఐసి ఎండి బిపి ఆచార్యతో చర్చించానన్నారు. ప్లాట్ల కేటాయింపు విధి విధానాలన్నీ జివోల్లో పొందుపరిచారని, ప్రత్యేకంగా బోర్డు దృష్టికి తీసుకురావాల్సిన అవసరంలేదని ఆయన చెప్పారన్నారు.

మార్కెటింగ్‌కు సంబంధించిన విషయాలు బోర్డు సమావేశంలో ఎప్పుడూ చర్చకు రాలేదన్నారు. ఎండి కానీ, ఇతర సభ్యులు కానీ ఈ వివరాలను బోర్డు దృష్టికి తీసుకు రాలేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వమే ఎండిని ఈ స్పెషల్ పర్పస్ వెహికల్‌లో సభ్యుడిగా నియమించిందని, అందువల్ల ఆయనకు కచ్చితంగా విల్లాలు, ప్లాట్ల ధరల గురించి కచ్చితంగా తెలిసి ఉండాలన్నారు. బోర్డు సమావేశంలో ఆయన వీటి గురించి చెప్పి ఉంటే సమష్ఠిగా ఓ నిర్ణయం తీసుకునే వాళ్లమని అంబటి వివరణ ఇచ్చారు. ఇక ఎమ్మార్ హిల్స్ టౌన్‌షిప్, ఎమ్మార్ ఎంజీఎఫ్ ల్యాండ్ లిమిటెడ్ మధ్య ఒప్పందం కుదిరేనాటికి ఎపిఐఐసి చైర్మన్‌గా నా పదవీ కాలం ముగిసిందని చెప్పారు. ఇందులో ప్రభుత్వ నామినేటెడ్ సభ్యుడిగా ఉన్న ఆచార్యనే ఎపిఐఐసి తరఫున దీనిపై నిర్ణయం తీసుకోవాలన్నది తన అభిప్రాయమన్నారు.

ఎపిఐఐసి చైర్మన్‌గా తన పదవీ కాలం ముగిసిన తర్వాతే తన సోదరుడు మురళీ కృష్ణ అక్కడ ప్లాటు కొన్నారని చెప్పారు. తన తమ్ముడు కాంట్రాక్టర్ అని, నేరుగా స్టైలిష్ హోమ్స్‌ను గానీ, ఎమ్మార్ ఎంజీఎఫ్‌ను కానీ సంప్రదించి ప్లాట్ కొని ఉంటారన్నారు. ఈ విషయంతో తనకు ఎలాంటి సంబంధం లేదని అంబటి స్పష్టం చేశారు.