సినిమా బామ్మ రాధాకుమారి ఇక లేరు

                                            Radha Kumari

ఈ తరం హీరోలకు బామ్మగా, అమ్మగా అలరించిన నటి రాధా కుమారి(70) ఇక లేరు. నిన్న రాత్రి ఆమె గుండెపోటుతో హైదరాబాదులో మరణించారు. రాధా కుమారి ప్రముఖ నటుడు రావి కొండలరావుకు సతీమణి. ఈ దంపతులిద్దరూ వెండితెరపైన కూడా పలు చిత్రాలలో భార్యాభర్తలుగా నటించడం విశేషం. నాటక రంగం నుంచి చిత్రసీమలో అడుగుపెట్టిన రాధాకుమారి నాలుగు దశాబ్దాల పాటు నటిగా కొనసాగి, సుమారు 600 చిత్రాలలో నటించారు. 1962లో తేనె మనసులు చిత్రం ద్వారా సినీరంగంలోకి అడుగు పెట్టిన ఆమె నటిగా రాణించారు. బృందావనం, భైరవద్వీపం, ఒకరికొకరు, చందమామామ, వంటి చిత్రాలలో రాధాకుమారి బామ్మగా మెప్పించారు. బుల్లితెర సీరియల్స్ లోనూ రాధకుమారి నటిస్తున్నారు.

ప్రస్తుతం కొండలరావు అమెరికా ప్రయాణంలో ఉన్నారు. దుబాయ్ విమానాశ్రయంలో ఉన్న ఆయన విషయం తెలుసుకుని తిరుగు ప్రయాణం అయ్యారు. ప్రవాసాంధ్రులు నిర్వహించే ఓ కార్యక్రమంలో పాల్గొనే నిమిత్తం ఆయన అక్కడికి వెళుతున్నారు. 
ఆయన వచ్చిన తరువాత ఆమె అంత్యక్రియలు నిర్వహిస్తారు. ఆమె మరణం పట్ల తెలుగు చిత్రసీమ సంతాపం ప్రకటించింది.