అల్లరి నరేష్ చిత్రానికి 15 కోట్లు బడ్జెట్

అల్లరి నరేష్ చిత్రానికి 15 కోట్లు బడ్జెట్

అల్లరి నరేష్ చిత్రాలు అంటే మూడున్నర కోట్లు దాటి తియ్యాలంటే నిర్మాతలు ఆలోచనలో పడతారు. అంతకుమించి పెట్టుబడి పెడితే బిజినెస్ పరంగా ఇబ్బందులు ఎదురవుతాయని నిర్మాతలకు తెలుసు. అయితే తాజాగా అల్లరి నరేష్ కమిటైన ‘యాక్షన్'చిత్రానికి మాత్రం 15 కోట్లు వెచ్చిస్తారు. ఈ విషయాన్ని దర్శకుడు మరియు నిర్మాత అయిన అనిల్ సుంకర మీడియాకు స్వయంగా తెలియచేసారు. ఆయన దర్సకుడుగా మారుతూ రూపొందిస్తున్న ఈ చిత్రానికి 15 కోట్లు పెడుతున్నారు. ఈ విషయమై మాట్లాడుతూ...ఏకకాలంలో రెండు భాషల్లో రూపొందుతోన్న తొలి స్టీరియో స్కోపిక్ కామిక్ త్రీడీ చిత్రమిది. 15 కోట్ల వ్యయంతో అత్యున్నత సాంకేతిక విలువలతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం అన్నారు. అలాగే హైదరాబాద్, చెన్నయ్, గోవా, బ్యాంకాక్, ఫిన్‌ల్యాండ్ తదితర ప్రదేశాల్లో చిత్రీకరణ జరుపుతాం. బప్పీలహరి తనయుడు బప్పాలహరి ఈ సినిమా ద్వారా దక్షిణాదికి పరిచయం కాబోతున్నారు. అలాగే బప్పీలహరి కూడా స్వయంగా ఈ సినిమా కోసం ఓ ప్రత్యేక గీతాన్ని స్వరపరుస్తున్నారు'' అని తెలిపారు. ఇక అనీల్ సుంకర గతంలో బిందాస్, అహనా పెళ్లంట, దూకుడు చిత్రాలు నిర్మించారు. ఇక ఈ చిత్రానికి ‘విత్ ఎంటర్‌టైన్‌మెంట్' అనేది ట్యాగ్ లైన్. ‘అల్లరి'నరేష్, వైభవ్, రాజు సుందరం, ‘కిక్' శ్యామ్, స్నేహాఉల్లాల్, విమలారామన్, కామ్నా జఠ్మలాని, నాజర్ ఇందులో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రం కనుక మంచి లాభాలు గడిస్తే అల్లరి నరేష్ రేంజి పెరిగినట్లే. ఆయన తదపరి చిత్రాలు అన్నీ ఈ రేంజి బడ్జెట్ లోనే ప్లాన్ చేయటం ఖాయం.