రామోజీ ఈనాడు డైలీపై బొత్స ఫైర్

రామోజీ ఈనాడు డైలీపై బొత్స ఫైర్

తాను పిసిసి అధ్యక్ష పదవికి రాజీనామా చేసినట్లు రాసిన రామోజీ రావు దినపత్రిక ఈనాడుపై బొత్స సత్యనారాయణ తీవ్రంగా మండిపడ్డారు. ఉప ఎన్నికల ఫలితాలకు నైతిక బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై ఒత్తిడి పెంచే వ్యూహంలో భాగంగా బొత్స సత్యనారాయణ రాజీనామా చేసినట్లు ఈనాడు దినపత్రిక శుక్రవారం ఓ వార్తాకథనాన్ని ప్రచురించింది. తనపై కుట్ర జరుగుతోందని, అందులో భాగంగానే తనను లక్ష్యంగా చేసుకుని ఈనాడు పత్రికలో వరుస కథనాలు వస్తున్నాయని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిని, పార్టీని పలుచన చేస్తే.. వేరే పార్టీకి లబ్ధి చేకూరుతుందన్న ఉద్దేశంతో ఈ కథనాలను ఆ పత్రిక రాస్తూ ఉండవచ్చునని ఆయన అన్నారు.

ఉప ఎన్నికల ఫలితాలకు నైతిక బాధ్యత వహిస్తూ తానెందుకు రాజీనామా చేయాలని పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ శుక్రవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో ప్రశ్నించారు. సహజంగానే ఇందులో కుట్ర దాగి ఉంటుందని, ఒక వ్యక్తిని పలుచన చేయడం ద్వారా మరో వ్యక్తికి లాభం జరుగుతుందని భావిస్తూ ఉండవచ్చుననిస లేదా ఒక పార్టీని పలుచన చేస్తే మరో పార్టీకి ప్రయోజనం కలుగుతుందన్న ఆలోచన దాగి ఉండవచ్చునని ఆయన అన్నారు. ఆ పత్రికలో ఈ మధ్య కాలంలో వరుసగా తనపై కథనాలు వస్తున్నాయని చెప్పారు. 

తనపై కుట్రలు పన్నుతున్నవారెవరో తనకు తెలియదని.. కథనాలు రాస్తున్నవారికే తెలియాలని అన్నారు. ఎవరి స్వలాభం కోసం ఇలా చేస్తున్నారన్నది తనపై వరుసగా కథనాలు రాస్తున్నవారికే తెలియాలని దుయ్యబట్టారు."ఆ పత్రికా విలేకరి నాకు దాదాపు ఎనిమిది సార్లు ఫోను చేశారు. రాజీనామా చేశారా? అని ఆయన నన్ను ప్రశ్నించినప్పుడు.. అది వాస్తవమని నేను చెప్పలేదు'' అని బొత్స తెలిపారు. కానీ, ఆ పత్రికలో మాత్రం తాను రాజీనామా చేశానంటూ కథనం వచ్చిందని చెప్పారు. రాజీనామా చేశారో లేదో స్పష్టంగా చెప్పాలన్న ప్రశ్నకు.. బొత్స బదులిస్తూ, "కుట్ర పన్నుతున్నారంటే.. రాజీనామా చేయలేదని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఏమిటి? గిట్టని వాళ్లు, పెట్టనివాళ్లు వంద రకాలుగా గోబెల్స్ ప్రచారం చేస్తారు. దానితో నాకు సంబంధం ఏమిటి? నేను ఎందుకు రాజీనామా చేయాలి?'' అని ఎదురు ప్రశ్నించారు. ఇక, మంత్రి డీఎల్ రాజీనామా అంశం ఆయన వ్యక్తిగత అభిప్రాయమని బొత్స అన్నారు.