ఢిల్లీలో సిబిఐ జెడి

ఢిల్లీలో సిబిఐ జెడి

 సిబిఐ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీ నారాయణ సోమవారం ఢిల్లీ వెళ్లారు. ఆయన సిబిఐ డైరెక్టర్ ఎపి సింగ్‌తో సమావేశమయ్యారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆస్తుల కేసుతో పాటు మిగిలిన కేసులలోని పురోగతిపై సింగ్‌తో లక్ష్మీ నారాయణ చర్చిస్తున్నట్లుగా సమాచారం. కేసుల పురోగతిని ఉన్నతాధికారులకు వివరించేందుకే జెడి ఢిల్లీ వెళ్లారని సిబిఐ వర్గాలు అంటున్నాయని తెలుస్తోంది. అయితే జెడి ఢిల్లీ వెళ్లడంతో జగన్ కేసులో ఏం జరుగుతుందనే అంశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. జగన్ ఆస్తుల కేసులో విజయ సాయి రెడ్డిపై ఏప్రిల్ 2 తేది లోగా కోర్టులో సిబిఐ ఛార్జీషీట్ దాఖలు చేయాల్సి ఉంది. ఈ కేసులో ఇప్పటికే సిబిఐ అధికారులు ఎ-2గా ఉన్న విజయ సాయి రెడ్డిని అరెస్టు చేశారు. దీంతో ఎ-1గా ఉన్న జగన్‌ను సిబిఐ ఛార్జీషీట్ దాఖలు చేసే లోగా విచారిస్తుందా, అరెస్టు చేస్తుందా లేక ఆయనను విచారించకుండానే ఛార్జీషీట్ దాఖలు చేస్తుందా అనే అంశంపై జోరుగా చర్చ సాగుతోంది.

ఏప్రిల్ 2 తేదిలోగా ఛార్జీషీట్ దాఖలు చేయాల్సి ఉన్నప్పటికీ ఆ లోపే అంటే మార్చి 30వ తారీఖున సిబిఐ ఛార్జీషీట్ దాఖలు చేసేందుకు సిద్ధమౌతోందని అంటున్నారు. ఆ లోగా జగన్‌ను విచారణకు పిలవాలా లేక విచారించకుండానే ఛార్జీషీట్ దాఖలు చేయాలా అనే అంశంపై నేటి లక్ష్మీ నారాయణ, ఎపి సింగ్ సమావేశంలో తేలే అవకాశముందని అంటున్నారు. ఛార్జీషీట్‌లోనూ జగన్ పేరు ఉంటుందా లేదా అనే విషయం పైనా అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ఛార్జీషీట్‌కు కోర్టు గడువు సమీపిస్తుండటంతో అందరిలోనూ జగన్ కేసులో ఏమవుతుందోననే ఉత్కంఠ ప్రారంభమైంది. ఈ కేసులో దాదాపు విచారణ పూర్తయింది. కాగా ప్రస్తుతం జగన్ గుంటూరు జిల్లా ఓదార్పు యాత్రలో ఉన్నారు.