నమ్మించి మోసం చేసిన పివిఆర్ ఓనర్?

                                    Charminar

సిటీ సెంట్రల్ యజమాని గౌరీ శంకర్ గుప్తా డిఎల్ఎఫ్ కంపెనీకి భారీ మొత్తంలో కుచ్చుటోపీ పెట్టారు. సుమారు రూ.291 కోట్ల మేర చీటింగ్ చేసినట్లుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ మోసం గురించి డిఎల్ఎఫ్ కంపెనీ హైదరాబాద్ సిసిఎస్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. హైదరాబాద్‌కు చెందిన పివిఆర్ అధినేత జిఎస్ గుప్తా తనకు సంబంధించిన వివిధ కంపెనీల పేరుతో ప్లాట్లను, భూములను అభివృద్ధి చేస్తామని, మాల్స్, మల్టీప్లెక్స్‌లు నిర్మిస్తామని 2006లో డిఎల్ఎఫ్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నారు. లోయర్ ట్యాంక్‌బండ్‌లో ఉన్న పాత ఓ స్థలం అభివృద్ధి చేసే పని తమకే వచ్చిందంటూ డిఎల్ఎఫ్‌కి చెప్పి పెద్ద మొత్తంలో డబ్బు తీసుకున్నారు. అలాగే పాత గాంధీ ఆసుపత్రి స్థలం కూడా తమకే లీజుకు వచ్చిందంటూ ఆ కంపెనీని నమ్మించారు. ఆ స్థలాన్ని ప్రభుత్వం తొలుత గుప్తా కంపెనీలకు 33 సంవత్సరాలకు లీజుకు ఇచ్చింది. కానీ, ఆ నిర్ణయంపై రగడ రేగడంతో లీజును రద్దు చేసింది. 

ఈలోగానే లీజు పత్రంలో ఉన్న 33 సంవత్సరాలను గుప్తా కంపెనీ 99 సంవత్సరాలుగా మార్చి అభివృద్ధి పనుల పేరిట డిఎల్ఎఫ్ నుంచి రూ.280 కోట్లు తీసుకుంది. ఒప్పందం ప్రకారం ఇచ్చిన సమయం పూర్తయినా అభివృద్ధి పనులు చేపట్టక పోవడంతో డిఎల్ఎఫ్ సంస్థ పలుమార్లు ఆయన కంపెనీలకు నోటీసులు జారీ చేసింది. ఆ నోటీసులకు వారు స్పందించలేదు. దీంతో డిఎల్ఎఫ్ సంస్థ తమకు తాకట్టు పెట్టిన గుప్తా కంపెనీ భూముల, ప్లాట్ల వివరాలు సేకరించగా వాటన్నిటినీ అప్పటికే ఇతరులకు అమ్మేసినట్లు బయటపడింది. కొన్ని భూములు వీరికి చెందినవే కాదని తేలింది. గుప్తా తమను మోసగించినట్లు స్పష్టం కావడంతో డిఎల్ఎఫ్ సంస్థ పోలీసులను ఆశ్రయించింది. గుప్తాకు చెందిన వివిధ కంపెనీల్లో డైరెక్టర్లుగా ఉన్న గౌరీ శంకర్ గుప్తా, గోపాల్ గుప్తా, రాధేశ్యాం గుప్తా, మనోజ్ కుమార్ శర్మ, అమిత్ అగర్వాల్, సరితా గుప్తా, మేఘా గుప్తా, కోమల్ అగర్వాల్, మాంగ్రి గుప్తాలపై డిఎల్ఎఫ్ డిప్యూటీ మేనేజర్(లీగల్) సురేష్ కృష్ణ సిసిఎస్‌లో ఫిర్యాదు చేశారు. కాగా గుప్తా కంపెనీల ప్రతినిధులు ముందస్తు బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించడంతో అది రాకుండా చూడడానికి పోలీసు అధికారులు ప్రయత్నిస్తున్నారు. వారెవరూ దేశం దాటి పోకుండా లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు.