కాంగో ఆయుధాగారంలో పేలుడు

కాంగో ఆయుధాగారంలో పేలుడు

కాంగో నెత్తురోడింది. చిన్నపాటి అగ్నిప్రమాదం భారీ విధ్వంసాన్ని సృష్టించింది. ఆయుధాగారంలో జరిగిన ఈ ప్రమాదం మెప్లా ప్రాంతంలో భయోత్పాతాన్ని కలిగించింది. 200 మందిని పొట్టనపెట్టుకొంది. వందలాది మందిని క్షతగాత్రులను చేసింది. కాంగో రాజధాని బ్రజ్వేలి భారీ పేలుళ్ళతో దద్దరిల్లింది. ప్రమాదవశాత్తు ఆయుధ భాండాగారంలో చెలరేగిన మంటలు పెను ప్రమాదానికి కారణమయ్యాయి. ఆర్మ్స్‌ గొడౌన్‌లో శక్తివంతమైన బాంబులు, గ్రనైడ్‌లు పేలడంతో 200 మందికి పైగా చనిపోయారు. సుమారు 1500 మంది తీవ్రంగా గాయపడ్డారు. 

వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. మెప్లా ప్రాంతంలోని ఆయుధ భాండాగారంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఇవి శక్తివంతమైన పేలుడు పదార్ధాలకు అంటుకోవడంతో భారీ పేలుడు సంభవించింది. ప్రజలు ఏం జరుగుతుందో తెలుసుకోనేలోగానే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. మెప్లా ప్రాంతం మొత్తం నేలమట్టం అయ్యింది. పేలుడు ధాటికి అనేక మంది విగజీవులయ్యారు. కొందరు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పరుగులు తీశారు. 

రంగంలోకి దిగిన సైన్యం క్షతగాత్రులను బ్రజ్వేలి సెంట్రల్‌ ఆస్పత్రికి తరలించే పనిలో పడింది. ఇప్పటికే 150పైగా మృతదేహాలను మార్చురీకి తరలించారు. క్షతగాత్రుల ఆర్తనాధాలు, బంధువుల రోధనలతో హాస్పటల్‌ మార్మోగింది. ఇంకా శిధిలాల క్రింద చిక్కుకున్న వారిని ప్రత్యేక బృందాలు వెలికితీస్తున్నాయ్‌. పేలుడు ధాటికి కిలోమీటరు పరిధిలో ఉన్న భవంతులు సైతం దెబ్బతిన్నాయి. 

ఇదిలా ఉంటే అగ్నిప్రమాదానికి గల కారణాలపై ప్రభుత్వం ఆరా తీస్తోంది. నదీతీరంలో మంటలు గోడౌన్‌లోకి వ్యాపించాయని స్థానిక రేడియో ప్రకటించింది. అయితే ప్రభుత్వం అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది.