వీరు ఇటు: వారసులు వైయస్ జగన్ వైపు

వీరు ఇటు: వారసులు వైయస్ జగన్ వైపు

సీనియర్ నాయకులు కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీల్లో కొనసాగుతుండగా, వారి వారసులు మాత్రం వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్‌ వైపు చూస్తున్నారు. ఇప్పటికే కొంత మంది వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరగా, మరి కొంత మంది ఆ ప్రయత్నాల్లో ఉన్నారు. కొంత మంది మంత్రుల సంతానం కూడా వైయస్ జగన్ వైపు వెళ్లే క్రమంలో ఉన్నారు. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ నన్నపనేని రాజకుమారి కుమార్తె, అల్లుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. సిపిఐ మాజీ ఎమ్మెల్యే పువ్వాడ నాగేశ్వరరావు కుమారుడు అజయ్ కూడా వైఎస్సార్ కాంగ్రెస్‌లో చేరారు. పార్టీలో ఆయనకు కీలక పదవి లభించింది. 

కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలకు చెందిన మంత్రుల, మాజీ మంత్రుల, ఎమ్మెల్యేల కుటుంబ సభ్యులు కూడా వైయస్సార్ కాంగ్రెసు వైపు చూస్తున్నారు. రోడ్లు, భవనాల శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు కుమారుడు, పశు సంవర్ధక శాఖ మంత్రి పినిపె విశ్వరూప్ కుమారుడు, హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి కుమారుడు కార్తిక్ రెడ్డి కూడా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధపడినట్లు తెలుస్తోంది. అయితే, తాత్కాలికంగా వారికి అడ్డుకట్ట వేసినట్లు తెలుస్తోంది. 

మంత్రి ధర్మాన సోదరుడు, తాజా మాజీ ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. త్వరలో పదవీ విరమణ చేయనున్న తెలుగుదేశం పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యుడు, మాజీ మంత్రి డాక్టర్ ఎంవి మైసూరారెడ్డి కుమారుడు కూడా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరడంపై ఆసక్తితో ఉన్నట్లు చెబుతున్నారు. ఫీజు రీయంబర్స్‌మెంట్ డిమాండ్‌తో జగన్ ఇటీవల దీక్ష చేపట్టినపుడు మైసూరారెడ్డి కుమారుడు జగన్ దీక్షా శిబిరానికి వెళ్లి మద్దతు తెలిపారు. 

అనంతపురం జిల్లాకు చెందిన కాంగ్రెస్ సీనియర్ శాసనసభ్యుడు, మాజీ మంత్రి జెసి దివాకర్‌రెడ్డి కుమారుడు, మంత్రి డాక్టర్ డిఎల్ రవీంద్రారెడ్డి అల్లుడు, మాజీ మంత్రి, గుంటూరు జిల్లా బాపట్ల అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహిస్తున్న సీనియర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే గాదె వెంకటరెడ్డి కుమారుడు కూడా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరాలన్న అసక్తితో ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఇప్పటివరకు అటువంటి ఆలోచన ఏదీ లేదని జెసి, గాదె కూడా చెబుతున్నారు. రెవెన్యూ మంత్రి ఎన్ రఘువీరారెడ్డి కుమార్తె కూడా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పట్ల అసక్తి చూపిస్తూ హిందూపురం లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేయాలన్న ఉద్దేశంతో ఉన్నట్లు చెబుతున్నారు. మంత్రి రఘువీరారెడ్డి కూతురు గతంలో ఒకసారి జగన్‌తో భేటీ కూడా అయ్యారు.