భర్త అంత్యక్రియల్ని అడ్డుకున్న భార్య

నెల్లూరు: నెల్లూరు జిల్లా దువ్వూరు గ్రామంలో ఓ అమానవీయ సంఘటన చోటు చేసుకుంది. ఆస్తి తగాదాల కారణంగా మూడు రోజుల పాటు ఓ వ్యక్తి శవం ఇంటి ముందు ఉంది. భర్త శవానికి అంత్యక్రియలు చేయడాన్ని భార్యనే అడ్డుకుంది. ఆస్తి విషయం తేల్చే వరకు శవాన్ని కదలనిచ్చేది లేదని పట్టుబట్టింది. దీంతో శవానికి మూడు రోజుల పాటు అంత్యక్రియలు జరగలేదు. చివరికి పోలీసులు జోక్యం చేసుకుని పంచాయతీ చేయడంతో సమస్య పరిష్కారమైంది

నక్కా రమణయ్య అనే వ్యక్తికి కొంత భూమితో పాటు ఇల్లు ఉంది. అతను బంధువుల ఇంట్లో ఉంటూ మరణించాడు. రమణయ్య ప్రవర్తన సరిగా లేకపోవడంతో, అనారోగ్యంతో బాధపడుతుండడంతో అతని భార్య కూతురు ఇంట్లో ఉంటుంది. రమణయ్య మరణంతో ఆమె కూతురితో పాటు గ్రామానికి వచ్చింది. ఆస్తిని తమకు అప్పగించాలని ఆమె పట్టుబట్టింది. అందుకు బంధువులు నిరాకరించారు. దాంతో మూడు రోజుల పాటు శవం అలాగే ఉంది.

చివరికి గ్రామస్థులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు రంగ ప్రవేశం చేసి పంచాయతీ చేశారు. రమణయ్య కూతురికి కొంత ఆస్తి ఇచ్చేటట్లు ఒప్పందం చేశారు. దీంతో సమస్య పరిష్కారమైంది. రమణయ్య శవానికి అంత్యక్రియలు జరిగాయి.