మంచినీటి కోసం గ్రామీణుల అవస్థలు

మంచినీటి కోసం గ్రామీణుల అవస్థలు

ఒక అడుగు ముందుకు... రెండడుగులు వెనక్కి అన్నట్లు తయారైంది రూరల్‌ వాటర్‌ సప్లయ్‌ అధికారుల పరిస్థితి. ఎండుతున్న గొంతులతో గ్రామీణ ప్రజలు అల్లాడుతుంటే అధికారులు మాత్రం నిద్ర నటిస్తున్నారు. హైదరాబాద్‌లో ఏసీ గదుల్లో కూర్చునే ఇంజినీర్లు కాగితాలపై లెక్కలు చూపుతూ చేతులు దులుపుకుంటున్నారు. ప్రభుత్వం రిలీజ్ చేసిన నిధులను కూడా ఖర్చు చేయకుండా ప్రజలకు సర్కారు మార్క్ ఎండమావులను చూపుతున్నారు.

రూరల్‌ వాటర్‌ సప్లయ్ అధికారుల మధ్య సమన్వయ లోపం గ్రామీణ ప్రాంత ప్రజలకు శాపంగా మారింది. అధికారుల నిర్లక్ష్యంతో మంచినీటి పథకాలు నీరుగారిపోతున్నాయి. గుక్కెడు మంచినీళ్ల కోసం గ్రామీణులు నానాపాట్లు పడుతున్నా అధికారుల్లో చలనం కలగడం లేదు. దీంతో మండే ఎండల్లో నీటికోసం అవస్థలు పడుతున్నారు పల్లే ప్రజలు. రాష్ట్రంలో నీటిసదుపాయాలు లేని గ్రామాలు 4100లుగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. 

అధికారుల లెక్కల్లో చేరని గ్రామాల సంఖ్య ఇందుకు రెట్టింపుగా ఉంటుంది. ఈ 4100 గ్రామాల్లో 2700 గ్రామాలకు ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేస్తామని అధికారులు ప్రకటించారు. మరో 1400 గ్రామాలకు సమ్మర్‌ స్టోరేజీ ట్యాంకుల ద్వారా నీటిసరఫరా చేస్తామని చెబుతున్నారు. ఇందుకోసం 63 కోట్ల 73 లక్షల రూపాయలు మంజూరయ్యాయి. అయితే రూరల్‌ వాటర్‌ సప్లయ్స్‌లో అడ్మినిస్ట్రేషన్‌, ఇంజినీరింగ్‌, టెక్నికల్‌ విభాగాల మధ్య సమన్వయ లేమి కారణంగా గ్రామీణ మంచినీటి పథకాలు నత్తనడకను తలపిస్తున్నాయి. 

మంజూరైన నిధులను సద్వినియోగం చేసుకోలేకపోవడం, నిధులు ఖర్చుచేసేలోగా పుణ్యకాలం దాటిపోవడం షరామామూలుగా మారింది. గత ఏడాది నీటిఎద్దడి నివారణ పనులకు ప్రభుత్వం 65 కోట్ల రూపాయలు మంజూరు చేయగా.... అధికారులు కేవలం 34 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు చేశారు. మిగతా నిధులు అలా మూలుగుతూనే ఉన్నాయి. 

అధికారులు సమన్వయంతో పనిచేయకుంటే ఈ ఏడాది మంజూరైన నిధుల పరిస్థితి కూడా అలాగే ఉంటుందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇవేమీ పట్టని అమాత్యులు మాత్రం.... కోట్ల రూపాయల నిధులు మంజూరు చేశామని, నీటి సమస్య సమసిపోయిందంటూ గొప్పగా ప్రకటనలు చేస్తున్నారు.