రూ. 14 కోట్లు లంచం ఇవ్వ జూపారు: వికె సింగ్

రూ. 14 కోట్లు లంచం ఇవ్వ జూపారు: వికె సింగ్

 నాసి రకం సైనిక వాహనాలు, ఇతర సామాగ్రిని కొనుగోలు చేసేందుకు కొన్నేళ్ల క్రితం తనకు 14 కోట్ల రూపాయల లంచం ఇవ్వజూపారని భారత ఆర్మీ చీఫ్ వీకే.సింగ్ ఆరోపించారు. ఈ విషయాన్ని కేంద్ర రక్షణ మంత్రి ఏకే.ఆంటోనీ దృష్టికి తీసుకుని వెళ్లానని, అయితే ఆంటోనీ వైపు నుంచి ఎలాంటి స్పందన లేదని వీకేసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆర్మీకి అవసరమైన వాహనాలను కొనుగోలు చేసే విషయంలో నాసిరకం వాహనాలను కొనుగోలు చేస్తే తనకు రూ.14 కోట్లు ఇస్తానని ఒక మధ్యవర్తి తన వద్దకు వచ్చి బేరం మాట్లాడారని కానీ, తాను వాళ్ళ ప్రలోభానికి లొంగలేదని వీకే సింగ్ తెలిపారు.

అప్పటికే సుమారు 600 వాహనాలను కొనుగోలు చేసినట్టు ఆ మధ్యవర్తి తనకు చెప్పగా, ఈ విషయాన్ని తానే స్వయంగా రక్షణ మంత్రిత్వ శాఖకు తెలియజేసినట్టు చెప్పారు. దీనిపై విచారణ కూడా జరుగుతోందని వీకే సింగ్ ఒక ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఈ అంశం పార్లమెంట్ ఉభయ సభలను సోమవారం కుదిపేశాయి. సభ ప్రారంభంకాగానే ప్రశ్నోత్తరాల సమయాన్ని రద్దు చేసి వీకే సింగ్ ఆరోపణలపై చర్చించాలని ప్రధాన విపక్షమైన భారతీయ జనతా పార్టీ పట్టుబట్టి సభా కార్యక్రమాలకు అడ్డు తగిలింది. దీంతో స్పీకర్ మీరా కుమార్ సభను కొద్దిసేపు వాయిదా వేశారు.