కర్నాటకలో భారీ స్కామ్‌ !

దేశంలో రోజుకో స్కామ్‌ వెలుగు చూస్తోంది. ఈసారి కర్నాటక వంతొచ్చింది. గత పదేళ్ళ కాలంలో రెండు లక్షల కోట్ల రూపాయల విలువైన మైనారిటీ ఆస్తుల్ని అన్యులకు ధారదత్తం చేసిన వ్యవహారం కర్నాటకలో బహిర్గతమైంది. సాక్షాత్తు మైనారిటీ వెల్ఫేర్‌ మంత్రి ఈ మేరకు రూపొందించిన నివేదికను ముఖ్యమంత్రి సదానంద గౌడకు అందజేశారు. 

ఈ రిపోర్టు నేడో రేపో కర్నాటక అసెంబ్లీ ముందుకు రానుంది. 2001-2011 మధ్యకాలంలో వక్ఫ్‌బోర్డుకు చెందిన భూములు, భవనాలను పలు సంస్థలకు, వ్యక్తులకు చౌకగా కట్టబెట్టిన విషయం ప్రాథమిక విచారణలో వెల్లడైంది. ఈ వ్యవహారంపై మీడియాలో వచ్చిన కథనాల ఆధారంగా సీఎం గౌడ గత నవంబర్‌లో ప్రత్యేక విచారణ కమిటీని నియమించారు. మైనారిటీ వెల్ఫేర్‌ మినిస్టర్‌ అన్వర్‌ మనిప్పడీ సారథ్యంలోని విచారణ కమిటీ ప్రాథమిక దర్యాప్తును ముగించి, నివేదికను సీఎంకు అందజేసింది. వక్ఫ్‌ బోర్డు అస్తుల్ని ఇతరులకు ధారదత్తం చేయడం ద్వారా రాష్ట్ర ఖజానాకు రెండు లక్షల కోట్ల రూపాయల నష్టం వాటిల్లినట్లు తేలింది.