మావోయిస్టు అగ్రనేత శేషన్న మృతి

 మావోయిస్టు పార్టీ అగ్రనేత, ఉత్తర తెలంగాణ స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శి గుండేటి శంకర్‌రావు అలియాస్ శేషన్న దండకారణ్యంలో పాముకాటుతో చనిపోయారు. ఈ విషయాన్ని మావోయిస్టు పార్టీ ఉత్తర తెలంగాణ ప్రతినిధి జగన్ బుధవారం ప్రకటించారు. ఈనెల 17వ తేది రాత్రి దండకారణ్యంలోని ఒక షెల్టర్‌లో గుండేటి శంకర్ నిద్రించినపుడు ఆయనను పాము కరవగా, ఎలుక కరిచిందని అందరూ భావించారని, పరిస్థితి విషమించడంతో దళం శంకర్‌కు చికిత్స చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయిందని అన్నారు. రాత్రి 2గంటలప్రాంతంలో శంకర్ మృతి చెందినట్టు జగన్ తెలిపారు. శంకర్‌పై రాష్ట్ర ప్రభుత్వం రూ.10లక్షల రివార్డును ప్రకటించింది. 

గోదావరిఖని ప్రాంతానికి చెందిన శంకర్ 1983లో రాడికల్ విద్యార్థి సంఘం ద్వారా అప్పటి పీపుల్స్‌వార్‌లో చేరారు. ఆ తర్వాత పార్టీలో అంచెలంచెలుగా ఎదిగారు. ఆదిలాబాద్ జిల్లాలో 1990లో అరెస్టు అయ్యాడు. శంకర్‌తో పాటు మరో నలుగురు మావోయిస్టులను వరంగల్ జైలు నుంచి విడిపించుకునేందుకు అప్పటి పీపుల్స్‌వార్ పార్టీ అధికారులను కిడ్నాప్ చేసి వీరిని బయటికి తెచ్చింది. తిరిగి ఉద్యమంలోకి వెళ్లిన శంకర్ ఇప్పటి వరకు పార్టీలో అనేక ప్రాంతాల్లో హోదాల్లో పని చేశాడు. 2005వరకు మావోయిస్టు పార్టీ రాష్ట్ర కార్యకలాపాల్లో క్రియాశీలంగా ఉన్న శంకర్ అప్పటి నుంచి దండకారణ్యంలో అనేక బాధ్యతలు నిర్వహించినట్టు తెలుస్తున్నది. 

పార్టీలో దళ సభ్యురాలిగా పని చేసే ఆదిలాబాద్ జిల్లా ఆసిఫాబాద్ ప్రాంతానికి చెందిన జంగుభాయ్ అలియాస్ కవితను పెళ్లి చేసుకున్నారు. ఆమె రెండేళ్ల క్రితం పోలీసులకు లొంగిపోయింది. ఐదు రోజుల క్రితం చనిపోయిన శంకర్ మృతదేహానికి దండకారణ్యంలోనే మావోయిస్టు దళాలు అంత్యక్రియలు జరిపినట్టు తెలుస్తున్నది. అయితే శంకర్ మృతదేహం కోసం గోదావరిఖనిలో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ఎదురు చూస్తున్నారు. శంకర్ తండ్రి రాజం సింగరేణి రిటైర్డ్ గని కార్మికుడు