చిరుకి పవన్ కల్యాణ్ దూరమయ్యాడా!?

చిరుకి పవన్ కల్యాణ్  దూరమయ్యాడా!?

హైదరాబాద్: రామ్ చరణ్ తేజ హీరోగా నటించిన రచ్చ ఆడియో ఫంక్షన్‌కు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హాజరు కాకపోవడం మెగా సోదరుల మధ్య విభేదాల అంశం మరోసారి చర్చకు తెరలేపింది. చిరంజీవి తాను స్థాపించిన ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెసు పార్టీలో విలీనం చేసిన తర్వాత చిరు, పవన్ కల్యాణ్‌ల మధ్య విభేదాలు పొడసూపినట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. కాంగ్రెసు పార్టీలో పిఆర్పీ విలీనం ఇష్టం లేని పవన్ అన్నయ్యకు దూరంగా ఉంటున్నారనే వార్తలు వచ్చాయి. ఇటీవల విడుదలైన పవన్ కల్యాణ్ చిత్రం ఆడియో విడుదల కార్యక్రమానికి చిరు కుటుంబ సభ్యులు ఎవరూ రాలేదు. దీంతో విభేదాలు నిజమేనని అందరూ భావించారు. అయితే ఆ తర్వాత చిరంజీవి విభేదాలను కొట్టి పారేశారు. దీంతో ఆ అంశానికి తెరపడింది. అయితే తాజాగా ఆదివారం చెర్రీ నటించిన రచ్చ ఆడియో ఫంక్షన్‌కు పవన్ హాజరు కాలేదు. దీంతో సోదరుల మధ్య విభేదాలు ఉన్నాయేమోనని అభిమానుల్లో ఆందోళన వ్యక్తమయింది. ఫంక్షన్ కు వచ్చిన అభిమానుల్లో ఒకింత నిరాశ కనిపించింది.

అయితే అభిమానుల ఆందోళనను గమనించిన చిరంజీవి స్పందిస్తూ.. మీరంతా పవన్ గురించి ఆలోచిస్తున్నారని తెలుసునని, అయితే గబ్బర్ సింగ్ స్పెషల్ ఎఫెక్ట్స్ కోసం పవన్ అమెరికా వెళ్లారని వివరణ ఇచ్చారు. ఉదయమే పవన్ చెర్రీకి ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపారని చెప్పారు. ఈ పంక్షన్‌ను మొదట నాలుగో తారీఖున అనుకున్నామని, అదే రోజు అయితే పవన్ వచ్చే వారని కానీ అనుకోకుండా అమెరికా వెళ్లారన్నారు. రామ్ చరణ్ కూడా మీరంతా పవన్ కోసం చూస్తున్నారని తెలుసునని ఆడియో ఫంక్షన్ డేట్ చేంజ్ కావడం వల్లనే రాలేక పోయారని అభిమానులకు చెప్పారు. అయితే నిన్న పవన్ సినిమా ఆడియో ఫంక్షన్‌కు చిరంజీవి కుటుంబ సభ్యులు రాకపోవడం, ఇప్పుడు చెర్రీ ఆడియో ఫంక్షన్‌కు పవన్ దూరంగా ఉండటం అందరిలోనూ అనుమానాలు రేకెత్తిస్తుంది. మరి చిరు, చెర్రీ చెప్పినట్లుగా అనుకోకుండా డేట్ చేంజ్ కావడం వల్లనే రాలేదా లేదా తన అభిమానులే తన కుటుంబ సభ్యులు అని పవన్ సరిపెట్టుకోవాల్సి వస్తుందా చూడాలి!