మీ ఇష్టం (‘నా ఇష్టం'రివ్యూ)

మీ ఇష్టం (‘నా ఇష్టం'రివ్యూ)

తాను ఆర్య తీసిన సుకుమార్ శిష్యుడుని కాబట్టి తన కెరీర్ కూడా సజావుగా సాగాలంటే ఆర్య లాంటి కథతోనే ఎంట్రీ ఇవ్వాలనుకున్నాడో ఏమోగానీ నూతన దర్శకుడు ప్రకాష్ తోలేటి కూడా అలాంటి కథతోనే రంగంలోకి దూకేసాడు. అయితే అప్పుడు ఆర్య కు అద్బతమైన స్క్రిప్టు,పాటలు,ముఖ్యంగా ఎనర్జిటిక్ హీరో ప్లస్ అయ్యారు. ఇక్కడ ఈ మూడు విభాగాలు మిస్సయ్యాయి. దగ్గుపాటి రానా ఏదో తనకు సంభందంలోని సినిమాలో గెస్ట్ గా నటిస్తున్నట్లు ఫేస్ లో ఏ ఎక్సప్రెషన్ చూపకుండా,నటనలో వేరియేషన్స్ చూపకుండా జీవించుకుంటూ వెళ్లిపోవటం సినిమాకు జీవం లేకుండా చేసేసింది. జెనీలియా సైతం పెళ్ళి హడావిడిలో ఉందో ఏమో కానీ నటనలో సీరియస్ నెస్ లేకుండా జాగ్రత్తపడింది.

గణేష్(రానా)తాను బాగా స్వార్దపరుడుని అని ఫీలయ్యి,అలా బివేహ్ చేస్తూండే(అఫ్ కోర్స్ త్రాగితే నిస్వార్దపరుడుగా మారతాడనుకోండి) కుర్రాడు. మలేషియాలో సెటిలైన అతనికి ఓ రోజు ఇండియా నుంచి పారిపోయి వచ్చిన కృష్ణవేణి (జెనిలియా) పరిచయమవుతుంది. తన ప్రియుడు కిషోర్ (హర్షవర్దన్ రానే)ని పెళ్లి చేసుకుందామని తన తండ్రి(నాసర్)కి మస్కా కొట్టి మలేషియా వచ్చేసింది ఆమె. కొన్ని సినిమాటిక్ ట్విస్టు తర్వాత మన హీరో గణేష్ ఆమెతో ప్రేమలో పడిపోతాడు. ఈ లోగా అందరూ ఊహించినట్లుగానే కిషోర్ కథలోకి దూకేస్తాడు. అప్పుడు ఏమౌతుంది. హీరో త్యాగం చేసి ఆమెకు పెళ్లి చేస్తాడా...లేక స్వార్ధపరుడు కాబట్టి తన స్వార్దమే చూసుకుంటాడా వంటివి తెరపై చూసి తెలుసుకోవాల్సిన అమూల్యమైన విషయాలు. 

హీరో,హీరోయిన్ నే పెళ్లి చేసుకుంటాడు అనేది అని కొత్తగా తెలుగు సినిమా ప్రేక్షకుడుగా మారిన వాడికి సైతం తెలుసు. అయితే ఎలా హీరో...ఆల్రెడీ వేరే వాడితో ప్రేమలో ఉన్న హీరోయిన్ తో ఐలవ్యూ చెప్పించుకుంటాడనేదే ఈ సినిమాల్లో ఆసక్తి కరంగా చూపిస్తూంటాయి. చిత్రంగా ఈ సినిమాలో అలా ఆసక్తిగా చూపించే అంశమే కరువయ్యింది. ఫస్టాఫ్ కథకు సంభందం లేకపోయినా ప్రెండ్స్ ...కబుర్లు..ఫైట్స్ అంటూ స్పీడుగా వెళ్లిపోయింది. సెకండాఫ్ కి వచ్చేసరికి అస్సలు కథ చెప్పాల్సిన చోట ఆగిపోయింది. ఎలా ఆమె మనస్సులో చోటు సంపాదించాడు అనేది సరిగ్గా ఎస్టాబ్లిష్ చేయలేకపోయాడు. దాంతో కథనం పూర్తిగా బోర్ గా తయారైంది. అలాగే హీరోకి ఇచ్చిన సెల్ఫిష్ అనే క్యారెక్టరైజేషన్ ఒకటి రెండు సీన్స్ లో తప్ప కనపడదు. మిగాతా సీన్స్ లో రెగ్యులర్ తెలుగు సినిమా హీరో లా బిహేవ్ చేస్తూంటాడు.

అదే ఆర్య 2 లోనూ హీరోకి ఇలాంటి క్యారెక్టరైజేషనే(స్వార్ధపరుడు అని కాదు) ఉన్నప్పటికీ ఆ నేరేషన్ వేరేగా ఉంటుంది. తను ప్రేమించిన ఆమె కోసం అతను ఎంతకైనా తెగించే మనస్తత్వం ఆకట్టుకుంటుంది. అదిలా ఉంటే హీరో తండ్రి పాత్ర ని కథలో కి సంభదం లేకుండా తీసుకువచ్చి విలన్,ఫైట్స్ పెట్టారు. అదీ మరీ ఇబ్బందిగా తయారైంది. అంతేగాక కావాలని చేసారో మరేమో కానీ సినిమా అంతా హీరో ప్రెండ్స్ మాట్లాడుకుంటూ ఉండటంతోనే సరిపోతుంది. ఇక ఈ చిత్రం చూస్తుంటే ఎప్పుడో చూసిన అభయ్ డియోల్ అహిస్తా..అహిస్తా సినిమా గుర్తుకు రావచ్చు. లేదా ఇదే దర్శకుడు కథ అందించి సాయిరామ్ శంకర్ ..వాడే కావాలి సినిమా గుర్తుకు రావచ్చు...అది మీ తప్పు కాదు.

కథ,కథనం వదిలేస్తే దగ్గుపాటి రానా తన మూడో సినిమాలోనూ పెద్దగా నటనలో ఏ మార్పూ చూపలేకపోయాడు. రానా తన తొలి రెండు చిత్రాలు కన్నా నటనలో,డైలాగు డెలవరీలో ఇంప్రూవ్ అయినా డైలాగ్స్ చెబుతూంటే మాటిమాటికి ప్రభాస్ ని అనుకరిస్తునట్లు తెలిసిపోతుంది. అప్పటికీ పైట్స్,పాటలతో,డైలాగ్స్ తో దర్శకుడు నటన అనే యాంగిల్ ని దాటేద్దామని చూసినా చాలా చోట్ల రానా దొరికిపోయాడు. జెనీలియా గురించి ఈ సినిమాలో చెప్పుకునేది ఏమీ లేదు...ఆమె కూడా ఈ సినిమా మైనస్ లలో ఒకటిగా మారింది. బ్రహ్మానందం, అలీ వంటి టాప్ కమిడెయిన్స్ ఉన్నా నవ్వించలేకపోయారు. 

రచన చేసిన కోన వెంకట్ కలం బలం ఏమై పోయిందో అనిపిస్తుంది. చక్రి పాటల్లో ఓ సాధియా..ఓ సాధియా పాట ఒకటే మెలోడిగా బావుంది. కెమెరా,ఎడిటింగ్ ఓకే. నిర్మాత బాగా ఖర్చుపెట్టాడనే విషయం స్పష్టమవుతుంది కానీ రానా మీద అంత ఖర్చు పెట్టడం(బిజినెస్ పరంగా) ఆశ్చర్యమనిపిస్తుంది. దర్శకుడుగా కన్నా ప్రకాష్ మాటల రచయితగా ఈ సినిమాలో చాలా చోట్ల రాణించాడు. ఫైనల్ గా ఈ సినిమా టైటిల్ తగ్గట్లే నా ఇష్టం నేను ఇట్లానే చేస్తాను అన్నట్లు తయారైంది. ఇంత చదివాక కూడా చూడాలనుకుంటే అది మీ ఇష్టం.