రేణుకా చౌదరికి మంత్రి పదవి?

రేణుకా చౌదరికి మంత్రి పదవి?

రాజ్యసభకు ఎన్నికైన కాంగ్రెసు నాయకురాలు రేణుకా చౌదరికి కేంద్ర మంత్రి పదవి దక్కే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మెగాస్టార్ చిరంజీవితో పాటు రేణుకా చౌదరిని కూడా ప్రధాని మన్మోహన్ సింగ్ మంత్రివర్గంలోకి తీసుకునే అవకాశాలున్నట్లు చెబుతున్నారు. ఏప్రిల్ రెండో వారంలో మన్మోహన్ సింగ్ మంత్రి వర్గాన్ని పునర్వ్యరస్థీకరించనున్నట్లు సమాచారం. తెలంగాణ కోటాలో రేణుకా చౌదరికి మంత్రి పదవి ఇవ్వాలని కాంగ్రెసు పార్టీ అధిష్టానం భావిస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో కూడా రేణుకా చౌదరి ఖమ్మం లోకసభ సభ్యురాలిగా ఎన్నికై మంత్రి పదవిని చేపట్టారు. 

2014 ఎన్నికల్లో రాష్ట్రంలో పార్టీని విజయపథంలో నడిపించే ఉద్దేశంతోనే చిరంజీవికి, రేణుకా చౌదరికి కేంద్రంలో మంత్రి పదవులు ఇవ్వాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. తెలంగాణకు రెండు కేంద్ర మంత్రి పదవులు దక్కవచ్చునని, అందులో ఒకటి రేణుకా చౌదరికి దక్కుతుందని చెబుతున్నారు. పైర్ బ్రాండ్ రేణుకా చౌదరి దూకుడును వచ్చే ఎన్నికల్లో ఉపయోగించుకోవాలని కాంగ్రెసు అధిష్టానం భావిస్తున్నట్లు చెబుతున్నారు. అందుకే ఆమెకు మంత్రి పదవి ఇవ్వాలని అనుకుంటున్నట్లు చెబుతున్నారు. 

తనకు మంత్రి పదవి దక్కుతుందనే విషయాన్ని రేణుకా చౌదరి శనివారం చెప్పకనే చెప్పారు. తనకు మంత్రి పదవి ఇచ్చే విషయంపై ఎటువంటి సమాచారం లేదని అంటూనే తాను మంత్రి అయిన తర్వాత తెలంగాణ కోసం ఏం చేస్తానో చూస్తారని ఆమె అన్నారు. రాజ్యసభకు తనను ఎంపిక చేసినందుకు కృతజ్ఞతలు చెప్పడానికి ఆమె పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీని కలిసిన తర్వాత ఆమె మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. తాను తెలంగాణ ఆడబిడ్డనని ఆమె చెప్పుకున్నారు. దీన్నిబట్టి ఆమె తెలంగాణ నాయకురాలిగానే గుర్తింపు పొందడానికి ప్రయత్నిస్తున్నారని అర్థం చేసుకోవచ్చు.