టిఆర్ఎస్‌ ఆపరేషన్ ఆకర్షకు లొంగొద్దు

టిఆర్ఎస్‌ ఆపరేషన్ ఆకర్షకు లొంగొద్దు

 తెలంగాణ రాష్ట్ర సమితి ఆపరేషన్ ఆకర్ష్‌కు లొంగి పోవద్దని మాజీ మంత్రి శంకర రావు ఆదివారం అన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఇచ్చే దిశగా కాంగ్రెసు పార్టీ అధిష్టానం పావులు కదుపుతున్నదని అన్నారు. ఉప ఎన్నికల్లో కాంగ్రెసు పార్టీ ఓటమికి భయపడి కాంగ్రెసు పార్లమెంటు సభ్యులు, శాసనసభ్యులు తెరాస ఆపరేషన్ ఆకర్ష్‌లో పడవద్దని సూచించారు. 1953 నుండి ఇటీవల జరిగిన ఎన్నికలను గమనిస్తే రాష్ట్రంలో కాంగ్రెసు పార్టీకి 33 శాతం ఓటు బ్యాంక్ ఉందని రుజువు అయిందన్నారు. ఢిల్లీ వెళ్లి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు గురించి తాను ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ వద్ద ప్రస్తావిస్తానని అన్నారు. తెలంగాణ కోసం వరంగల్ జిల్లా రఘునాథపల్లి మండలానికి చెందిన బోజ్యా నాయక్ మృతి కలచి వేసిందన్నారు.

తాను పార్టీలు మారే నాయకుడిని కాదని స్పష్టం చేశారు. మొదటి నుండి కాంగ్రెసు విధేయునిగా ఉన్నానని అదే పార్టీలో కొనసాగుతానని అన్నారు. పదవుల కోసం ముఖ్యమంత్రిని విమర్శిస్తున్నానంటూ సొంత పార్టీ వారు తనపై ప్రకటనలు చేయడాన్ని ఆయన తప్పు పట్టారు. 1985 నుంచి వేరే పార్టీలో ఉన్న నాయకులు ఆప్పుడు ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీల పేర్లు కూడా స్మరించలేదన్నారు. అటువంటి వారు తనపై విమర్శలు చేయడం హాస్యాస్పదమన్నారు. మున్ముందు ఎవరికి సీటు దక్కుతుందో, ఎవరు ఎన్నికల్లో గెలుస్తారో చూద్దామని ఆయన అన్నారు.