పోలీస్‌ స్టేషన్‌లో సీతారాములు !

పోలీస్‌ స్టేషన్‌లో సీతారాములు !

దేవున్ని గుండెలో బంధించే భక్తుల్ని చూశాం...? ఏళ్లకు ఏళ్లు అదే ధ్యాసగా భగవంతున్ని కొలిచేవాళ్లను చూశాం..? కానీ కోరిన కోరికలు తీర్చే స్వామిని జైల్లో వేసిన భక్తుల గురించి మీకు తెలుసా..? అది కూడా శ్రీకరామచంద్రున్ని.. సతీసమేతంగా పోలీస్ స్టేషన్‌కు అంకితం చేసిన జనం మీకు ఎక్కడైనా తగిలారా...? అయితే ఈ స్టోరీ చూడండి.

ఇది ప్రకాశం జిల్లా పామూరు మండలం బొంతెద్దిపాడు గ్రామం. 2001లో ఇక్కడి దేవాలయంలో దొంగలు పడి సీతారాములతో పాటు లక్ష్మణుడి పంచలోహా విగ్రహాలను ఎత్తుకెళ్లారు. గ్రామస్తుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు ...2003లో వాటిని వరంగల్‌లో పట్టుకున్నారు. అక్కడి నుంచి పామూరు పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. విగ్రహాలు దొరికాయని కబురు పంపగా ...అదేం విచిత్రమోగానీ ఆ సమయానికి ఊళ్లో వాళ్లంతా రెండుగా చీలిపోయారు. 

ఎవరి వారూ కొత్తగా ఆలయాలు కట్టి...ఆ విగ్రహాలు తమకు కావాలంటే తమకని...ఖాకీలకు కొత్త తలనొప్పి పెట్టారు. దీంతో ఏం చేయాలో వాళ్లకు అర్థంగాక...లక్ష్మణ సమేత సీతరాముల్ని జైలు పాల్జేశారు. ఇది జరిగి 10 ఏళ్లు కావొస్తున్నా....ఇప్పటికీ ఈ దేవదేవులకు విముక్తి లభించలేదు. 

ఏడాదికి ఒక్కసారి వచ్చే శ్రీరామనవమి రాష్ట్రమంతా గుళ్లల్లో జరిగితే .....ఈ ఊళ్లో మాత్రం పోలీస్ స్టేషన్‌లో జరుగుతుంది. పోలీసులు దగ్గరుండి ఆ ఆదర్శ దంపతుల పెళ్లి చేస్తున్నారు. ఈసారి కూడా అదేవిధంగా జరగనుంది. ఎందుకంటే గ్రామస్తుల మధ్య గొడవలు ఇప్పటికీ అలాగే ఉన్నాయి మరి. మనుషుల తలరాతలు రాసి ..వాటిని ఇష్టమున్నట్టు మార్చే దేవుడు ....ఈ గ్రామస్తుల బుద్దులు మాత్రం మార్చలేకపోతున్నాడు. ఫలితంగా తానే ఓ ఖైదీలా బందీ అయిపోయాడు. 

14 ఏళ్ల వనవాసంలా ...14 ఏళ్ల కారగారవాసం చేస్తాడేమో ఈ రాముడు. ఈ విచిత్రానికి ఫుల్ స్టాప్ పడాలంటే ..ఉన్నతాధికారులే పూనుకోవాలి. బొంతెద్దిపాడు జనానికి నచ్చజెప్పి...విగ్రహాలను ఏదో ఒక ఆలయానికి చేర్చాలి. లేదంటే ఊరి వాళ్లతో సంప్రదించి ఒకే ఆలయం ఉండేలా ఒప్పించాలి.