రివాల్వర్‌తో కాల్చుకుని ఎస్పీ ఆత్మహత్య

ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పూర్ జిల్లా ఎస్పీ రాహుల్ శర్మ సోమవారం తన సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఆఫీసర్స్ మెస్‌లోని బాత్‌రూంలో ఆయన ఈ అఘాయిత్యానికి
 పాల్పడ్డారని పోలీసులు తెలిపారు. ఆయన ఆత్మహత్యకు గల పూర్తి కారణాలు తెలియరాకపోయినా కుటుంబ కలహాలతోనే ఈ ఘటనకు పాల్పడినట్టు భావిస్తున్నారు. శర్మ భార్య రైల్వే శాఖలో అధికారిణిగా పనిచేస్తున్నారు. 2002 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన శర్మ 2007 నుంచి 2009 వరకు దంతెవాడ జిల్లా ఎస్పీగా పనిచేశారు. జిల్లాలో కోయకమాండో వ్యవస్థ స్థాపించడంలో కీలకపాత్ర పోషించారు. 

ఆయన హయాంలోనే నాగా, మిజో వంటి పారా మిలటరీ బలగాలు మావోయిస్టుల వేట కోసం దండకారాణ్యానికి వచ్చాయి. సల్వాజుడుం వ్యవస్థపై అనేక ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో శర్మను రాయ్‌గఢ్ జిల్లా ఎస్పీగా బదిలీ చేశారు. ఇటీవలే బిలాస్‌పూర్ ఎస్పీగా బదిలీ అయిన శర్మ 15 రోజుల సెలవు అనంతరం రెండు రోజుల క్రితమే విధుల్లో చేరారు. ఇదిలా ఉండగా, అందరితో కలివిడిగా ఉండే శర్మ మృతి చెందడంపై విషాదం నెలకొంది. ఆయన మరణ వార్త తెలిసిన వెంటనే ఆ రాష్ట్ర హోం మంత్రి నాన్‌కీరాం కన్వర్, పోలీస్ ఉన్నతాధికారులు బిలాస్‌పూర్ చేరుకున్నారు.