ప్రభాకరన్‌ కుటుంబంపై సైన్యం కసి

AA

ఎల్‌టిటిఈని అంతమొందించేందుకు శ్రీలంక సైన్యం అవలంభించిన కిరాతక విధానం మరోసారి తెరమీదికొచ్చింది. పెద్ద పులి ప్రభాకరన్‌ను అంతమొందించిన విధానం రెండేళ్ళ క్రితమే విమర్శల పాలైనా ప్రస్తుతం ప్రభాకరన్‌ తనయుడి మృతదేహానికి సంబంధించిన దృశ్యాలను రెండు విదేశీ ఛానళ్ళు వెలుగులోకి తేవడంతో మరోసారి ఈ అంశం ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తోంది. 

లంక సైన్యం అకృత్యాలపై విచారణ జరగాలన్న డిమాండ్‌ ఊపందుకుంటోంది. తమిళ ఈలం కోసం మూడు దశాబ్దాల పాటు పోరుసల్పి రెండేళ్ళ క్రితం సైన్యం చేతిలో దారుణ హత్యకు గురైన వెలుపిళ్లై ప్రభాకరన్‌ ఇప్పటికీ లంక పాలకులకు నిద్ర లేకుండా చేస్తున్నారు. ప్రభాకరన్‌ను అంతమొందించేందుకు, ఆయన కుటుంబీకుల్ని సైతం మట్టుబెట్టేందుకు అప్పట్లో లంక ప్రభుత్వం కిరాతక చర్యలకు ఉసి గొల్పిందన్న కఠోర వాస్తవాన్ని రెండు విదేశీ ఛానళ్ళు వెలుగులోకి తేవడంతో మరోసారి వివాదం మొదలైంది. 

ప్రభాకరన్‌ తనయుడు పదమూడేళ్ళ బాల చంద్రన్‌ మృతదేహాన్ని పరిశీలించిన డుండీ యూనివర్సిటీ ఫోరెన్సిక్‌ నిఫుణుడు ప్రొఫెసర్‌ డెర్రిక్‌ పౌండర్‌ అత్యంత సమీపం నుంచి కాల్పులు జరిపారని ధృవీకరించాడు. డెర్రిక్‌ వ్యాఖ్యలతో కూడిన డాక్యుమెంటరీలోని కొన్ని భాగాలను విడుదల చేసిన విదేశీ ఛానళ్ళు పూర్తి నిడివితో డాక్యుమెంటరీని ప్రసారం చేసేందుకు సిద్దమవుతున్నాయి. తమిళ పులులతో సుదీర్ఘంగా సాగిన పోరు చివరి దశకు వచ్చే సరికి లంక సైన్యం అత్యంత హేయమైన రీతిలో వ్యవహరించిందని అంతర్జాతీయ మీడియా ఘోషించింది. 

అప్పట్లో ఈ వాదనలను కొట్టి పారేసిన లంక ప్రభుత్వం ఇపుడు సంజాయిషీ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి వస్తోంది. ప్రభాకరన్‌ కుటుంబంతోపాటు లక్షలాది మందిని దారుణంగా చంపేసిన ఉదంతాలకు సజీవ సాక్ష్యాలను మీడియా వెలుగులోకి తేవడంతో లంక సైన్యం అకృత్యాలపై నిష్పక్షపాత విచారణ జరపాలన్న డిమాండ్‌ ఊపందుకుంటోంది. అయితే విదేశీ ఛానళ్ళు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని లంక ప్రభుత్వం నమ్మబలుకుతోంది. దీనిపై భారత్‌ సర్కార్‌ నోరు మెదపకపోవడం తమిళుల ఆగ్రహానికి కారణమవుతోంది. బద్ద వైరి పక్షాలైన డిఎంకె, అన్నా డిఎంకె పార్టీలు ఒకే కంఠంతో విచారణకు డిమాండ్‌ చేస్తున్నాయి.