విద్యార్థినికి టీచర్ వాతలు

విశాఖపట్నం: పాఠశాలలో తెలుగు మాట్లాడినందుకు ఓ విద్యార్థినికి టీచర్ వాతలు పెట్టారు. విశాఖపట్నంలోని ఎంఎస్ఎన్ పాఠశాలలో మంగళవారం ఈ సంఘటన చోటు చేసుకుంది. పాఠశాలలో నాలుగో తరగతి చదువుతున్న పావని అనే విద్యార్థినికి టీచర్ చేతిపై వాతలు పెట్టారు. ఆ వాతల ఆనవాళ్లు ఇప్పటికీ విద్యార్థిని చేయిపై ఉన్నాయి. పావని తల్లిదండ్రులు సంఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు పాఠశాల ప్రిన్సిపాల్‌ను అదుపులోకి తీసుకున్నారు. 

తాము పావనిని కొట్టలేదని, పావనే పెన్నుతో వాతలు పెట్టుకుందని ప్రిన్సిపాల్ అంటున్నారు. పావని ఆత్మహత్య చేసుకునే ప్రయత్నంలో ఉందని చెబుతున్నారు. ఈ సంఘటనపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. పాఠశాల గుర్తింపును రద్దు చేయాలని మాజీ మంత్రి మండలి బుద్దప్రసాద్ డిమాండ్ చేశారు. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.