దుమారం రేపుతున్న ఆర్మీ చీఫ్ లేఖ

దుమారం రేపుతున్న ఆర్మీ చీఫ్ లేఖ

ఆర్మీ చీఫ్ వీకే సింగ్ యూపీఏ సర్కారుకు ముచ్చెమటలు పట్టిస్తున్నారు. ఇప్పటికే రకరకాల స్కాములు, అంతర్గత కలహాలతో కకావికలమైన మన్మోహన్ ప్రభుత్వం..సింగ్ ప్రధానికి రాసిన లేఖ మరిన్ని కష్టాలను తెచ్చిపెట్టింది. తనకు లంచమివ్వబోయారని నిన్న బాంబు పేల్చిన ఆయన.. తాజాగా యుద్దట్యాంకులు తుప్పుపట్టిపోతున్నాయని ప్రధానికి లెటర్ రాసి సంచలనం రేపారు. 

దీంతో ఇప్పటిదాకా మిస్టర్ క్లీన్ గా ఉన్న రక్షణ మంత్రి ఆంటోనీ సెల్ఫు డిఫెన్సులో పడ్డారు. ఆర్మీ చీఫ్ వికె సింగ్ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు రాసిన లేఖ పెను దుమారాన్నే రేపుతోంది. దీనిపై వివరణ ఇవ్వాలని రాజ్యసభలో బిజెపి సభ్యుడు వెంకయ్య నాయుడు డిమాండ్ చేశారు. దేశ భద్రత విషయంలో రాజీ పడేది లేదని రక్షణ శాఖ మంత్రి ఎకె ఆంటోనీ ఇచ్చిన వివరణతో ప్రతిపక్ష సభ్యులు సంతృప్తి చెందలేదు. దీంతో రాజ్యసభ వాయిదా పడింది. 

సైన్యంలో ఆయుధాల కొరత ఉందని.. యుద్ధ ట్యాంకులు శిథిలావస్థకు చేరుకున్నాయని వీకే సింగ్ తన లేఖలో పేర్కొన్నారు. సైన్యం కన్నా వైమానిక దళమే బాగుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈనేపథ్యంలో కేంద్ర మంత్రులు చిదంబరం, ఆంటోనీ.. ప్రధానితో సమావేశమై ఈ వ్యవహారంపై చర్చించారు. అటు.. వికె సింగ్‌ను తొలగించాలని ఎస్పీ, జెడియు, ఆరెల్డీ డిమాండ్ చేశాయి. 

అయితే, దీనిని బిజెపి వ్యతిరేకించింది. సింగ్‌పై చర్య తీసుకోకపోతే చెడు సంప్రదాయం ఏర్పడుతుందని జెడియు నాయకుడు శివానంద్ తివారీ అన్నారు. వికె సింగ్‌ను తప్పించి, జైలులో పెట్టాలని ఎస్పీ నేత రాంగోపాల్ యాదవ్ అన్నారు. లీక్‌పై విచారణ జరిపించి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని వామపక్షాలు డిమాండ్ చేశాయి. 

ఈనేపథ్యంలో తన ఆరోపణలపై సీబీఐకు వీకే సింగ్ రాతపూర్వక ఫిర్యాదు చేసే అవకాశం కనిపిస్తోంది. అటు.. వాహనాలు కొనుగోళ్లలో అవినీతి జరిగినట్టు రుజువైతే ఒప్పందాలు రద్దు చేస్తామని ఆంటోనీ ఇప్పటికే స్పష్టం చేసారు.