యూపీఏను కుదిపేస్తున్న లొసుగులు

యూపీఏను కుదిపేస్తున్న  లొసుగులు

వరుస వివాదాలతో సతమతమవుతున్న యుపిఏకు మరో ఎదురు దెబ్బ తగిలింది. రక్షణ రంగంలో అవినీతిని ప్రస్తావిస్తూ... యుపిఏ భాగస్వామి తృణమూల్‌కు చెందిన ఎంపీ ఒకరు రాసిన లేఖ సిబిఐకి చేరింది. ఏడాది క్రితం రాసిన ఈ లేఖను వివాదాస్పద ఆర్మీ చీఫ్‌ వి.కె.సింగ్‌ సిబిఐకి అందజేశారు. టిఎంసికి చెందిన ఎంపీ అంబికా బెనర్జీ రాసిన ఈ లేఖలో ఆర్మీ కొనుగోళ్ళలో అవినీతి ప్రస్తావన వుంది. కాగా... ఈ లేఖ తాను రాసిందేనని సదరు ఎంపీ అంగీకరించారు. 

ఇలాంటి లేఖలెన్నో ప్రధాని, రక్షణ మంత్రులకు రాశానని, దురదృష్టవశాత్తు ఎవరూ ఎలాంటి చర్యలూ తీసుకోలేదని బెనర్జీ ఆరోపించారు. ఆర్మీ వినియోగించే నైట్‌ విజన్‌ డివైజెస్‌, కమ్యూనికేషన్‌ సిస్టమ్స్‌, పారాచ్యూట్స్‌, ఆయుధాల కొనుగోలు ఒప్పందాల్లో ముడుపులు చేతులు మారాయని బెనర్జీ ప్రధానికి రాసిన లేఖలో పేర్కొన్న నేపథ్యంలో ఈ వ్యవహారం యుపిఏ మెడకు చుట్టుకునే సంకేతాలు బలపడ్డాయి.