తదుపరి అరెస్టు ఎవరిది?

 తదుపరి అరెస్టు ఎవరిది?

 వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ ఆస్తుల కేసులో సిబిఐ చార్జిషీట్ దాఖలు చేయాల్సిన గడువు సమీపిస్తున్నకొద్దీ తదుపరి ఎవరు అరెస్టవుతారనే ఉత్కంఠ పెరుగుతోంది. ఏప్రిల్ 2వ తేదీలోగా జగన్ ఆస్తుల కేసులో సిబిఐ కోర్టులో చార్జిషీట్ దాఖలు చేయాల్సి ఉంది. అలా చేయకపోతే అరెస్టయినవారికి బెయిల్ లభిస్తుంది. ఇప్పటి వరకు వైయస్ జగన్ ఆస్తుల కేసులో జగతి పబ్లికేషన్స్ వైస్ చైర్మన్ విజయసాయి రెడ్డిని మాత్రమే సిబిఐ అరెస్టు చేసింది. 

గడువులోగా చార్జిషీట్ దాఖలు చేసి, ఆ తర్వాత అనుబంధ చార్జిషీట్ దాఖలు చేయడానికి కూడా సిబిఐకి అవకాశం ఉంది. అయితే, చార్జిషీట్ దాఖలు చేయడానికి ముందే ముఖ్యులను అరెస్టు చేయడం సిబిఐ ఆనవాయితీగా పెట్టుకుంది. ఎమ్మార్, గాలి జనార్దన్ రెడ్డి అక్రమ మైనింగ్ కేసుల్లో ఇదే పని చేసింది. దీంతో వైయస్ జగన్ ఆస్తుల కేసులో ఈ వారంలోగా సిబిఐ ఎవరిని అరెస్టు చేస్తుందనే ఉత్కంఠ కొనసాగుతోంది. వైయస్ జగన్ ఆస్తుల కేసులో సిబిఐ దర్యాప్తును ముమ్మరం చేసింది. ఇప్పటికే పలువురిని సిబిఐ అధికారులు ఈ కేసులో ప్రశ్నించారు. 

తాజాగా, వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వ హయాంలో పెట్టుబడులు, మౌలిక సదుపాయాల కల్పనా మంత్రిగా పనిచేసిన మోపిదేవిని సిబిఐ అధికారులు ప్రశ్నించారు. అలాగే, అప్పట్లో మౌలిక సదుపాయాల కల్పన ముఖ్య కార్యదర్శిగా పనిచేసిన ఐఎఎస్ అధికారి మన్మోహన్ సింగ్‌ను మూడు రోజుల పాటు ప్రశ్నించారు. ఎమ్మార్ ప్రాపర్టీస్ కుంభకోణం కేసులో జైలులో ఉన్న ఐఎఎస్ అధికారి రాజగోపాల్‌ను కూడా విచారించారు. మరో ఐఎఎస్ అధికారి శ్రీలక్ష్మిని కూడా వైయస్ జగన్ ఆస్తుల కేసులో విచారించే అవకాశం ఉంది. మొత్తం మీద, ఆ వారం రోజుల్లో ఎవరైనా అరెస్టవుతారా అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.