సవతి పోరు వల్లనే లాడెన్ హతం?

 సవతి పోరు వల్లనే లాడెన్ హతం?

 అగ్ర రాజ్యాలను వణికించిన అంతర్జాతీయ ఉగ్రవాది, అల్ ఖైదా చీఫ్ తన చివరి రోజుల్లో సవతుల పోరుతో సతమతమయ్యారా? ఐదుగురు భార్యల్లో ఒకరిచ్చిన సమాచారం మేరకే అబోత్తాబాద్ నివాసంలో లాడెన్‌ను అమెరికా దళాలు మట్టుపెట్ట కలిగాయా? అంటే నిజమేనని ఓ పాక్ సైనికాధికారి నివేదిక చెబుతోంది. పాక్ మాజీ సైనికాధికారి షౌకత్ ఖదీర్ ఎనిమిది నెలల పాటు శోధించి రూపొందించిన నివేదికను చూస్తే ఇదంతా నిజమేనని నమ్మవలసి వస్తోంది. ఐదుగురిలో ముగ్గురు ఆయనతో కలిసి అబోత్తాబాద్ నివాసంలో ఉండేవారని, చివరి భార్య అమల్ అహ్మద్ అల్ సదాహ్ అంటే లాడెన్‌కు అమిత ఇష్టమని, పై అంతస్తులో ఉండే తన గదిలోనే ఆమె పడక కూడా ఏర్పాటు చేశాడని, సదాహ్‌కు లాడెన్ ఇస్తున్న ప్రాధాన్యం మిగతా భార్యలకు కంటగింపుగా మారిందని, పెద్ద భార్య ఖైరియా సబేర్ ఏకంగా గొడవలకు దిగేదని, లాడెన్‌పై అలక వహించి తన పడకను కింది అంతస్తులోకి మార్చేసుకుందని, వారికి సర్దిచెప్పే సరికి లాడెన్ తల ప్రాణం తోకకు వచ్చేదని న్యూయార్క్ టైమ్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఖదీర్ వివరించారు.

లాడెన్ మరణానంతరం పాక్ దర్యాప్తు అధికారులకు ఈ విషయాలను సదాహ్ పూసగుచ్చినట్లు వెల్లడించినట్లు చెప్పారు. లాడెన్‌పై అసంతృప్తితో ఖైరియానే ఆయన ఆచూకీని అమెరికా దళాలకు అందించిందని, అందులోభాగంగానే దాడి కేంద్రమైన పై అంతస్తును ఖాళీ చేసి తన బసను కింది అంతస్తుకు మార్చుకున్నదని సదాహ్ గట్టిగా వాదించినట్టు ఖదీర్ పేర్కొన్నారు. 2005లో అబోత్తాబాద్ చేరుకునే వరకు లాడెన్ నున్నగా గడ్డం గీసుకునే వారని, ఆ తరువాత నుంచి తిరిగి బారు గడ్డం పెంచడం ప్రారంభించారని సదాహ్ వివరించినట్టు తెలిపారు. అందరూ అనుకున్నట్టు లాడెన్ భవనం దుర్భేద్యమైన కోటేమీ కాదని, కనీస భద్రతా ఏర్పాట్లు కానీ, సిబ్బంది కానీ లేరని లాడెన్ మరణానంతరం భవంతిని సందర్శించిన ఖదీర్ వెల్లడించారు.