భారీ ఎన్‌కౌంటర్ 13 మంది మావోలు హతం

భారీ ఎన్‌కౌంటర్ 13 మంది మావోలు హతం

జార్ఖండ్ రాష్ట్రంలో గురువారం భద్రతా బలగాలకు, మావోయిస్టులకు మధ్య భీకరమైన ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఎదురు కాల్పుల్లో 13 మంది మావోయిస్టులు హతమైనట్లు సమాచారం. జార్ఖండ్‌లోని బర్వాదియా అటవీ ప్రాంతంలో ఈ ఎన్‌కౌంటర్ జరింది. ఇందులో ఇద్దరు భద్రతా బలగాల అధికారులు కూడా గాయపడినట్లు తెలుస్తోంది. తర్వాత కూడా మావోయిస్టుల కోసం భద్రతా బలగాలు గాలింపు చర్యలు కొనసాగిస్తోంది. గాయపడిన మావోయిస్టులు కొద్ది మంది పారిపోయినట్లు అనుమానిస్తున్నారు. 

లతేహార్ జిల్లాలోని బర్వాదియా అటవీ ప్రాంతంలో గురువారం ఉదయం 11.30 గంటలకు ఎదురు కాల్పులు ప్రారంభమయ్యాయి. గాయపడినవారిలో ఓ కోబ్రా జవాను, మరో జాగ్వార్ ఫోర్స్ జవాను ఉన్నట్లు సమాచారం. ఎదురు కాల్పుల్లో ఎంత మంది మరణించారనేది మృతదేహాలను స్వాధీనం చేసుకుంటే తప్ప చెప్పలేమని పోలీసు ఇన్‌స్పెక్టర్ జనరల్ (ఆపరేషన్) ఆర్ కె మాలిక్ చెప్పారు. 

మావోయిస్టుల కోసం భద్రతా బలగాలు అటవీ ప్రాంతంలో గాలింపు చర్యలు చేపట్టినప్పుడు ఈ ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. ఆరుగురు మావోయిస్టులు మరణించి ఉండవచ్చునని మాలిక్ అంటున్నారు. అయితే, 13 మంది మరణించినట్లు వార్తలు వస్తున్నాయి. వీరిలో కూడా పది మంది మావోయిలు, మరో ముగ్గురు వేరేవారని అంటున్నారు. వివరాలు అందాల్సి ఉంది.